రానున్న రోజుల్లో అడవులపై మరింత ఒత్తిడి 

Date:09/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
అఖిల భారత అటవీ సర్వీసుకు ఎంపికై తమ శిక్షణలో భాగంగా దక్షిణ భారత పర్యటనలో ఉన్న 84 మంది ఐ.ఎఫ్.ఎస్ అధికారులు ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వివిధ శాఖల పనితీరును తెలుసుకుంటున్న ట్రైనీ అటవీ అధికారులు, తెలంగాణ అటవీ శాఖను రెండు రోజుల పాటు అధ్యయనం చేస్తున్నారు.
తెలంగాణ అటవీ శాఖ అమలు చేస్తున్న పథకాలు, హరితహారం, అటవీ అర్బన్ పార్కులు, అటవీ పునరుజ్జీవన చర్యలను ఈ అధికారుల బృందం అధ్యయనం చేసింది. అర్బన్ పార్కులతో పాటు, చౌటుప్పల్ సమీపంలో అటవీ అమరవీరుల స్మృతివనాన్ని ఈ బృందం సందర్శించింది. ఆతర్వాత అరణ్య భవన్ లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఈ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన పీసీసీఎఫ్ పీకే ఝా,  పర్యావరణం, పచ్చదనం కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోందని,
తెలంగాణకు హరితహారం పచ్చదనం పరంగా దేశంలోనే గొప్ప ప్రయత్నమన్నారు. మిగతా రాష్రాలు అన్నీ కలిపి నాటిన మొక్కల కంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎక్కువ అని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది పథకాల వల్ల అడవులపై ఒత్తిడి పెరుగుతోందని, అభివృద్దికి సహకారం అందిస్తూనే, అటవీ భూములను కాపాడుకోవటం, పచ్చదనం పెంచటం అటవీ అధికారుల మొదటి ప్రాధాన్యతగా ఉండాలన్నారు. పర్యావరణం, అడవుల రక్షణ అటవీ అధికారులు నిబద్దతతో పనిచేస్తేనే సాకారమౌతుందన్నారు.
అరణ్య భవన్ లో వివిధ శాఖాధిపతులుగా పనిచేస్తున్న సీనియర్ అధికారులు ప్రొబేషనరీ అధికారులతో తమ పరిధిలోకి వచ్చే విషయాలతో పాటు, తమ సుదీర్ఘ సర్వీసులో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. వేసవిలో అడవిపై ఆదారపడి జీవించే పేదవారి కోసం తునికాకు సేకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఏటా 50 కోట్ల రూపాయల దాకా వ్యయం చేస్తున్నట్లు పీసీసీఎఫ్ (ప్రొడక్షన్ ) పృధ్వీరాజ్ వెల్లడించారు.
అడవులు, వాటి ఆధారంగా జరిగే నేరాల అదుపుపై పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్, కంపా నిధులు, వ్యయంపై లోకేష్ జైస్వాల్, హరితహారం, అటవీ శాఖ పునర్ వ్యవస్థీకరణ, ఫలితాలపై అదనపు అటవీ సంరక్షణ అధికారి (అడ్మిన్) మునీంద్ర, అటవీ చట్టాలు, అభివృద్ది పథకాలకు అటవీ భూముల మళ్లింపుపై శోభ,  సామాజిక అడవుల పెంపకంపై ఆర్ ఎం డోబ్రియల్, అటవీ భూముల సర్వే, గిరిజనకు భూ పంపిణీపై స్వర్గం శ్రీనివాస్ తమ అనుభవాలను ప్రోబేషనరీ ఐ.ఎఫ్.ఎస్ అధికారులతో పంచుకున్నారు.
మొత్తం 84 మంది ప్రొబేషనరీ ఐ.ఎఫ్.ఎస్ అధికారుల బృందం తెలంగాణలో తమ పర్యటన ఆసక్తికరంగా ఉందని, మిగతా పెద్ద నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో వాతావరణంతో పాటు, జీవనం కూడా సాఫీగా ఉందన్నారు. వివిధ అటవీ సంబంధిత అంశాలపై సీనియర్ అధికారులతో తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం, అడవుల రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.  ఈ బృందంలో ముగ్గురు తెలంగాణ క్యాడర్ కు ఎంపికైన విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:  More stress on forests in the coming days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *