ఇద్దరు పిల్లలతో కలిసి.. రైలు కింద పడి తల్లి ఆత్మహత్య

నల్గొండ ముచ్చట్లు:


ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజూ తల్లితో కలిసి బైక్ పై స్కూల్ కు వెళ్లే ఆ తల్లీపిల్లలు ఇక లేరని తెలిసి గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకోవడం నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. నల్గొండకు చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి అక్కడ బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన రమ్యకు అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు సంతానం. వీరు పలు వ్యాపారాలు చేసి, ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో జానారెడ్డి తండ్రి కొండల్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నెల మాసికం కార్యక్రమానికి ఇద్దరు పిల్లలతో కలిసి రమ్య, జానారెడ్డి స్వగ్రామానికి వెళ్లారు. అనంతరం పిల్లలను స్కూల్ లో దింపి వస్తానని చెప్పి, రమ్య బైక్ పై నల్గొండ వెళ్లింది. పిల్లలను స్కూల్లో దింపి వస్తానని భర్తతో చెప్పి రైల్వేస్టేషన్‌ వెళ్లిన రమ్య.. శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గుంటూరు టికెట్‌ తీసుకుంది. మార్గమధ్యంలోని సత్తెనపల్లిలో పిల్లలతో సహా రైలు దిగింది. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ కింద పడి, రెడ్డిగూడెం సెక్షన్‌లో పిల్లలతో సహా రమ్య ఆత్మహత్య చేసుకుంది.మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే కాల్ కనెక్ట్ అవలేదు. మరోవైపు.. ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ద్వారా వివరాలు తెలుసుకుని జానారెడ్డికి సమాచారం అందించారు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. కాగా.. ఇద్దరు పిల్లలతో కలిసి నల్గొండ నుంచి గుంటూరు జిల్లాకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమ్య, ఆమె భర్త జానారెడ్డి ఫోన్ లోని కాల్‌డేటాను ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు అక్కడి ఎస్సై తెలిపారు. కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలే కారణమని భావిస్తున్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Tags: Mother commits suicide by falling under train

Post Midle
Post Midle
Natyam ad