అనుమానాస్పద స్థితిలో మోటార్ సైకిల్ దగ్ధం
సామర్లకోట ముచ్చట్లు:
సామర్లకోట పట్టణం బళ్ల మార్కెట్ సమీపంలోని భీమవరంపేటలో సోమవారం అర్ధరాత్రి దాటిన సమయంలో అనుమానాస్పద స్థితిలో ఒక మోటార్ సైకిల్ దగ్ధమయింది.
మోటార్ సైకిల్ లో ఉంచిన రూ. 50 వేలు నగదు కాలి బూడిదయింది. బాధితుడు దూలపల్లి రాజు అందించిన వివరాలు ప్రకారం సోమవారం సాయంత్రం ప్రైవేట్ ఉద్యోగ విధులలో భాగంగా ఊరు వెళ్లి వచ్చిన రాజు తన ఇంటి వద్ద ఎప్పటి మాదిరిగానే మోటార్ సైకిల్ ను పార్క్ చేసి రాత్రి ఇంట్లో నిద్రపోతున్నాడు.
అయితే రాత్రి 12 గంటల సమయంలో పక్కింటి వ్యక్తి వచ్చి మోటార్ సైకిల్ కాలిపోతున్నట్టు సమాచారం అందించారన్నారు. దానితో బయటకు వచ్చి చూడగా అప్పటికే మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధమైందన్నారు. అయితే మోటర్ సైకిల్ లోనే సీట్ కింద గల డిక్కీలో తమ ఓనర్ కు చెందిన రూ. 50వేల రూపాయలు నగదు బ్యాగ్ తో ఉంచి తాళం వేసినట్టు ఆయన చెప్పారు. ఆ నగదు మొత్తం పూర్తిగా దగ్ధమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో మోపెడ్ మోటార్ సైకిల్ కూడా పాక్షికంగా దద్ధమైనట్టు వారు చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి తనకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవన్నారు. స్థానిక పోలీసులకు బాధితుడు రాజు ఫిర్యాదు చేసామన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Motorcycle burned in suspicious condition
