మధురవాడ పేరుతో సినిమా

-గ్రామంలో ఆనందం
Date:10/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఊర్లు పేరు మీద ఇప్పటి వరకూ చాలా సినిమాలే వచ్చాయి. అంచలంచెలుగా అభివద్ధి చెందుతూ ఎదుగుతున్న ప్రాంతం మధురవాడ. దీని పేరు మీద నరేన్‌ సమర్పణలో డ్రామా క్వీన్‌, జస్వంత్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఏడుగురు యువకుల మధ్య సాగే యాక్షన్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో నూతన నటీనటులతో తెలుగు, తమిళం, కన్నడం భాషలలో సినిమాను నిర్మిస్తున్నారు. అజిత్‌ వాసన్‌ ఉగ్గిన దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆవిష్కరించారు. తమిళంలో ప్రముఖ హీరో సూర్య సోదరుడు కార్తి, కన్నడంలో ఈ సినిమా ప్రొడ్యూసర్‌, హీరో నరేన్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి తెలుగులో బివి.కష్ణారెడ్డి, ఎం.వెంకటేష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.జయాపజయాలను పక్కనబెడితే తమ ఊరు పేరు మీద సినిమా తీస్తున్నారని తెలిస్తే ఆ జిల్లా వాసులు మాత్రం చిత్రం ప్రారంభం నుంచీ విడుదలయ్యే వరకూ ప్రతి చిన్న విషయాన్నీ తెలుసుకోవాలని ఉబలాటపడతారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన కేరాఫ్‌ కంచరపాలెం చిత్రం విషయంలోనూ అదే జరిగింది.
విశాఖ జిల్లాలోని కంచరపాలెం వాతావరణాన్ని స్పృశిస్తూ సాగిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సంగతి మరువకముందే నగరంలోని ప్రముఖ ప్రాంతం మధురవాడ పేరు మీద సినిమా తెరపైకి వచ్చేస్తోంది. ఇప్పుడు స్మార్ట్‌ సిటీలో ఎక్కడ చూసినా ఆ చర్చే నడుస్తోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను తెలుపుతూ సాగేదే ఈ కథనం. దర్శకుడు అజిత్‌ వాసన్‌ ఉగ్గిన మధురవాడ వాసి. 13 ఏళ్ల వయసులో చంద్రంపాలెం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వయసులోనే సినిమాల మీద ఆసక్తి పెరిగింది.
ఇంట్లో చెప్పకుండానే విశాఖ నుంచి తమిళనాడు వెళ్ళిపోయాడు. సినిమా రంగంలో ప్రవేశించి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చాడు. అంచలంచెలుగా పైకి ఎదిగి ఖుషీ సినిమా డైరెక్టర్‌ ఎస్‌జె.సూర్య దగ్గర శిష్యరికం చేశాడు. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశాడు. అనంతరం నాని సినిమాకు వర్క్‌ చేశాడు.
కన్నడలో ‘వాసు నాన్‌ పక్క కమర్షియల్‌’ అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మధురవాడ సినిమా పనిలో బిజీబిజీగా ఉన్నాడు. మధురవాడ సినిమా పోస్టర్లు ఇప్పటికే 3 భాషలలో విడుదల చేశామని, త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి విడుదల చేసే అవకాశముందని వెల్లడించారు.
Tags: Movie is titled Madhuravada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *