మృత్యుమార్గం

Mrtyumargam

Mrtyumargam

Date:17/09/2018
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణాజిల్లాలో అదో రద్దీ మార్గం. రాజధాని అమరావతిని గుడివాడ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాతో కలిపే ప్రధానం మార్గం. కానీ అడుగడుగునా ఇబ్బందులే..ప్రమాద ఘంటికలే. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే గుడివాడ- కంకిపాడు రోడ్డు అధ్వానంగా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఈ రోడ్డు అభివృద్ధిని మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు.
గుడివాడ- కంకిపాడు మధ్య మానికొండ మీదుగా వెళ్లే రోడ్డు నిర్వహణపై  ఆర్ అండ్ బీ శాఖ నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గుడివాడ, విజయవాడ ఆర్‌అండ్‌బీ డివిజన్ల పరిధిలో ఉన్న 30 కిలోమీటర్ల ఈ రోడ్డుకు అయిదేళ్ల కాలంలో కేవలం Rs 4.90కోట్లు మాత్రమే వెచ్చించారు. మానికొండ రోడ్డు నరకానికి నకలుగా తయారైంది. రోడ్డుకు ఒకవైపు కాలువ, మరోవైపు పంటబోదె ఉండటం వల్ల రోడ్డు నిత్యం కోతకు గురవుతోంది.
అలైన్‌మెంటు సరిగాలేకపోవడంతో ఈ మార్గంలోని ఏదో ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెంట్రప్రగడ వద్ద రోడ్డు ‘జడ్‌’ ఆకారంలో మెలిక తిరగడం, అంకమ గుంట లాకుల వద్ద ‘ఎస్‌’ ఆకారంలో ఉండటం ప్రమాదాలకు కారణమవుతోంది.
మానికొండ రోడ్డులో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలపై పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ శాసనసభలో, జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ట్రాఫిక్‌ అడ్వయిజరీ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రోడ్లు భవనాలు శాఖ గుడివాడ, విజయవాడ డివిజన్‌ అధికారులు ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పరిశీలించారు.
మానికొండ రహదారికి ఒక వైపు పంట కాలువ, మరో వైపు పంటబోదె ఉండటం వల్ల కాలువ వైపు యుద్ధ ప్రాతిపదికన గోడ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సుమారు Rs 118 కోట్లు అవసరమనే అంచనాలకు వచ్చారు. రహదారులు భవనాల శాఖ విజయవాడ డివిజన్‌ పరిధిలో ఉన్న పునాదిపాడు నుంచి నందమూరు అడ్డరోడ్డు వరకు రోడ్డుకు ఒకవైపు గోడ నిర్మించేందుకు Rs 50 కోట్లకు అంచనాలు వేసినట్లు విజయవాడ డివిజన్‌ డీఈ రాధాకృష్ణ తెలిపారు.
విస్తరణకు Rs 18.60 కోట్లు గుడివాడ నుంచి పెదపారుపూడి వరకు శ్యామలకోడు వైపు రోడ్డు విస్తరించి గోడ నిర్మించేందుకు Rs 18.60 కోట్లకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
Tags:Mrtyumargam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *