Natyam ad

తెరపైకి మట్టి మాఫియా

మెదక్ ముచ్చట్లు:
 
వర్గల్ మండలంలో మట్టి మాఫియా హల్ చల్ చేస్తోంది. ఖాళీ ప్రభుత్వ భూమి కనబడితే చాలు తోడేస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా మట్టి త్రవ్వకాలు జరుపుతున్నారు.  రెవెన్యూ అధికారులు సైతం నిద్రాణ స్థితిలో జోగుతుండటంతో రాత్రనక, పగలనకా త్రవ్వుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడ్డూ చెప్పే వారు లేకపోవడంతో రెచ్చిపోయి తవ్వేస్తున్నారు. ఇష్టానుసారం మట్టిని తరలిస్తూ లక్షలు కోల్లగోడుతున్నారు. వర్గల్ మండలానికే చెందిన ఓ ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహరం నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలంలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. వర్గల్ మండల కేంద్రం రాజధానికి అతి సమీపంలోనే ఉండటంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతూ తమ నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు.తుర్కపల్లి,శామీర్ పేట్ పారిశ్రామిక ప్రాంతం అతి సమీపంగా ఉండటంతో నూతన పరిశ్రమల నిర్మాణాలు జోరుగానే సాగుతుంటాయి. ఈ క్రమంలోనే వారికి మట్టి అవసరం పడటంతో కొంతమంది మట్టి దందా చేసే వ్యక్తులను సంప్రదిస్తూ పెద్ద మొత్తంలో అధిక ధర వెచ్చించి మట్టిని కొనుగోలు చేస్తున్నారు.
 
 
మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న దందాను గమనించి వర్గల్ మండలానికి చెందిన ఓ ఇద్దరు టీఆర్ యస్ నాయకులు నయాగా మట్టి బ్రోకర్ల అవతారం ఎత్తారు.వర్గల్ సమీపంలోని నగరంతాండ -గౌరారం లింక్ రోడ్డులో ఇటీవలే టియస్ఐఐసి కి అప్పగించిన 1209 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని తమ త్రవ్వకాలకు ఎంచుకోన్నారు. ఏకంగా హిటాచి,జేసీబీ యంత్రాల సహయంతో టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు ప్రక్రియకు తెర తీశారు. రాత్రనక,పగలనకా మట్టి త్రవ్వకాలను,తరలింపును జోరుగా సాగిస్తున్నారు. ఇక్కడి నుండి తవ్వి తీసిన మట్టిని కోండపోచమ్మ ప్రాజెక్టు సమీపంలో గౌరారం వద్ద వ్యవసాయ పోలాల్లో డంప్ లుగా నిల్వ చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. టిప్పర్ మట్టిని ఆయా విధంగా డిమాండ్ కు తగ్గట్టూ 8 వేల నుండి 10వేల రూపాయల వరకు విక్రయిస్తూ లక్షల రూపాయల దందాను యధేచ్చగా నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతాలకు సైతం ఇక్కడి నుండే మట్టిని తరలిస్తారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వర్గల్ ,గౌరారం రహదారి నుండి మట్టి తరలింపులు జరుగుతున్నా..  పోలీసులు సైతం నిత్యం మట్టి తరలింపు వ్యవహరంపై మిన్నకుండిపోవడం గమనార్హం. మట్టి బ్రోకర్లు అధికార పార్టీ నేతలు కావడం వల్లే అధికారులు గప్ చుప్ గా ఉంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mud clay mafia on screen