మూగరోదన  

Date:10/11/2018
విజయనగరం ముచ్చట్లు:
మూగజీవాల పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పశువులు కొనాలన్నా.. అమ్మాలన్నా… వాటిని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నామో.. ఎక్కడకు తరలిస్తున్నామో.. ఏవిధంగా తరలిస్తున్నామో స్పష్టంగా తెలియజేయాలి. అందుకోసం వైద్యులు, వ్యవసాయాధికారులు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ నుంచి ధ్రువపత్రాలు కూడా పొందాలి. వీరంతా నిర్ధారించిన తర్వాత కొనుగోలు చేసిన పశువులను మూగాజీవాల పరిరక్షణ చట్టానికి లోబడి రవాణా చట్టం నిబంధనలు అనుసరించి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించాలి.
కాని వ్యాపారులు, రైతులు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇవేమీ తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తూ చట్టాన్ని అవహేళన చేస్తున్నారు.పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో పశువుల క్రయ,విక్రయాల వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో పార్వతీపురం ఏఎంసీ మార్కెట్‌ నుంచి రోజుకు పది నుంచి పన్నెండు టారాస్‌ లారీల్లో పశువుల రవాణా జరిగేది.
అయితే పశువులను తరలించవద్దంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో కలెక్టర్, ఎస్పీలు పార్వతీపురం మార్కెట్‌ నుంచి పశువుల రవాణా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్వతీపురం మార్కెట్‌ నుంచి పశువుల రవాణా నిలిచిపోయింది. అయితే లారీల ద్వారా పశువుల రవాణాను నిలిపివేసి వేరే మార్గాన్ని ఎన్నుకున్నారు.
అప్పుడు లారీల్లో తరలిస్తే ఇప్పుడు బొలేరో వాహనాల్లో.. కాలినడకన పశువుల మందలను జిల్లాను దాటించి అక్కడ లారీల్లో ఎక్కించి అక్రమమార్గంలో తరలిస్తున్నారు. ఇలా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో సాగుతున్న వ్యాపారం రూ. లక్షల్లో జరగుతోంది. ప్రతి వారం దాదాపు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఒడిశా నుంచి వచ్చిన మందలను పార్వతీపురం నుంచి బొబ్బిలి అక్కడ నుంచి మానాపురం..అలమండ మీదుగా జిల్లాను దాటించేస్తున్నారు.
పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో పశువుల క్రయ,విక్రయాలు బుధ, గురువారాల్లో జోరుగా సాగుతోంది. కొమరాడ మండలం పరశురాంపురం ప్రాంతానికి ఒడిశా నుంచి పశువులను ప్రతి బుధవారం తీసుకువస్తుంటారు. ఇక్కడ వ్యాపారులు పశువులను కొనుగోలు చేసి గురువారానికి పార్వతీపురం మార్కెట్‌కు తీసుకువస్తున్నారు.
అక్కడ నుంచి బోలేరో వాహనాల్లో లేదంటే కాలినడకన జిల్లా బోర్డర్‌ దాటించి అక్కడ నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే పార్వతీపురం మండలం అడ్డాపుశిల గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా పశువుల క్రయ,విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. జత పశువులను కాలి నడకన తరలించడానికి  ఒక్కో కూలికి రోజుకు రూ. 250 నుంచి 300 రూపాయల చొప్పున కూలి ఇస్తున్నారు.
పశువులను లారీల్లో తరలిస్తేనే పట్టుకుంటున్న అధికారులు కాలినడకన తరలిపోతున్న మందల వైపు దృష్టి సారించడం లేదు. అసలు ఈ మందలు ఎవరు కొంటున్నారు.. ఎవరి దగ్గర కొంటున్నారు.. ఎందుకోసం కొన్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారు.. క్రయ, విక్రయాలకు సంబంధించి ఏమైనా ధ్రువపత్రాలు ఉన్నాయా.. లేదా.. అన్న కోణంలో తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ అలసత్వమే పశువులు వ్యాపారులకు కలిసి వస్తోంది. దీంతో వారి వ్యాపారం మూడు దూడలు ఆరు పశువులుగా వర్థిల్లుతోంది.
ప్రతి గురువారం జరిగే పార్వతీపురం వారపు సంతకు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు తరలివస్తుంటారు. అయితే ఇక్కడకు వచ్చే పశువుల వ్యాపారుల నుంచి ఓ వ్యక్తి భారీగా డబ్బులు వసూలు చేసి పోలీసులకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. అందుకే పశువుల రవాణాను ఎవ్వరూ అడ్డుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గురువారం రెండు లక్షల రూపాయలు వివిధ రూపాల్లో అధికారులకు ముడుతున్నట్లు సమాచారం.
Tags; Mugarodana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *