వీణా వాణిలకు ముక్తి లేదా

Date:08/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పసిపాపలుగా తలలు అంటుకుని పుట్టినప్పుడు అయ్యో అని గుండె బద్దలయ్యేంత ఆవేదన చెందారు. ఎదుగుతున్న వయసులో ఈ శాపం ఇంకెన్నాళ్లు అని బాధపడ్డారు… యుక్తవయసుకొస్తున్న సమయంలో.. వారి బాధలు చూసినవాళ్లందరికీ గుండె తరుక్కుపోతూనే ఉంది. ఐనా.. ఏ ‘దేవుడూ’ వారిని వేరు చేయలేకపోతున్నాడు. వారి ఆశలకు జీవం పోయలేకపోతున్నాడు. ఆ ఇద్దరు అవిభక్త కవలలే వీణ, వాణి. వీడిపోని దేహాలు..  విడలేని ఆశలకు పదిహేనేళ్లు నిండాయి. అవిభక్త కవలలైన వీణ, వాణిలు ఇవాళ పదహారో ఏట అడుగుపెడుతున్నారు.
కదిలిస్తే.. వాళ్లిద్దరూ మాటలతో మంత్రం వేస్తారు. భవిష్యత్తుపై బంగారు కలలే కంటున్నారు. కానీ.. ఏం లాభం. ఏం చేసినా కలిసే కదలాలి. ఎక్కడకెళ్లినా.. ఉమ్మడిగా అడుగులేయాలి. వారిద్దరికీ జంట జీవితమే ఒంటరితనం. ఎంత కష్టం. ఎంత బాధ. ఎంత ఆవేదన. ఒకటి కాదు.. రెండు కాదు.. పదిహేనేళ్లుగా ఈ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు ఆ ఇద్దరు కవల బిడ్డలువీణ-వాణి. 2003 అక్టోబర్ 16న కవలలుగా పుట్టారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం వీరి సొంత ఊరు. మారగాని మురళి, నాగలక్ష్మి వీరి అమ్మానాన్న.
వీళ్లకు వీణ-వాణి రెండో సంతానం. తలలు అంటుకుని పుట్టిన ఈ బిడ్డలిద్దరూ మొదట రెండేళ్లపాటు గుంటూరు డాక్టర్ నాయుడమ్మ దగ్గర చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత 2006లో హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్ డాక్టర్లకు చూపించినా ఫలితం రాలేదు. ఆపరేషన్ కష్టమన్నారు. ఆస్ట్రేలియా, లండన్, సింగపూర్ దేశాలకు చెందిన ప్రముఖ డాక్టర్లు ముందుకొచ్చినా… వీణ-వాణిల పరిస్థితిలో మార్పురాలేదు. ప్రస్తుతం ఇద్దరు బాలికలు హైదరాబాద్ శిశువిహార్ లో ప్రభుత్వ సంరక్షణలో ఉంటున్నారు.
సొంత ఊరిలో ఉంటున్న వీరి అమ్మానాన్నలు తమ బిడ్డల గతి ఏమవుతుందో అని ఆందోళనతో కుమిలిపోతున్నారు. హైదరాబాద్ లో ఉపాధి దొరికితే తామే పిల్లల బాగోగులు చూసుకుంటామని అంటున్నారు. కానీ.. వీణ-వాణిలకు అదో గండంగా మారింది. ఏళ్లు మైలురాళ్లలా దాటుతున్నాయి. కాలం పరుగెడుతూనే ఉంది. కానీ.. వీరి కష్టకాలం మాత్రం తిష్టవేసుకుని కూర్చుంది. ఎదుగుతున్న ఈ బాలికల కష్టాలను తీర్చే… ఆ ‘దేవుడు’ ఎప్పుడొస్తాడో.
Tags: Mukti or Veenana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *