ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు 

 -ఏపీకి ప్రత్యేక హోదా తక్షణం అమలు పర్చాలి
-మేయర్ వినూత్న నిరసన
Date:14/04/2018
అనంతపురం ముచ్చట్లు:
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని..కేంద్రం తక్షణం ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని మేయర్ మదమంచి స్వరూప కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకొని “ఏపీకి ప్రత్యేక హోదా” అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేయర్ ఆధ్వర్యంలో స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ లోని పొట్టిశ్రీరాములు విగ్రహం నుండి మహిళలు, వందలాది మంది విద్యార్థులతో కలసి ప్లకార్డులు చేతపట్టి జడ్పీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ప్రత్యేక హోదా ఆంధ్రులు హక్కు.. విభజన హామీలు అమలు చేయాలి.. సేవ్ ఆంధ్ర ప్రదేశ్.. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ అందరూ కలసి ర్యాలీగా వెనక్కి నడుస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి తరువాత అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ప్రత్యేక హోదాలోనే ప్రత్యేక ప్యాకేజీ ఉందని, రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్న రెవెన్యూ లోటును పూరించాలన్న, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న, పన్ను రాయితీలు ఇవ్వాలన్నా ప్రత్యేక హోదా రావాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు సాక్షిగా నాటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలపై నేడు వెనక్కు తగ్గడం తగదన్నారు. ప్రత్యేక హోదా గురించి చట్టంలో పెట్టినా, పెట్టకపోయినా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడి ఏపీకి ప్రత్యేక హోదాను తక్షణం అమలు పర్చాలని డిమాండ్ చేశారు. హోదాతో పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, ఏపీ విభజన తర్వాత ఇక్కడ పరిశ్రమలు లేవన్నారు. రాయితీలు ఉంటే పరిశ్రమలు వస్తాయని, అప్పుడు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను సాధించే దాకా తమ పోరాటం ఆపమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సరళ, తెలుగు మహిళా నాయకురాళ్లతో సరిత, గౌరి, రమాదేవి, సుజాత, మల్లీశ్వరి లతో పాటు వందలాదిగా విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.
Tags:Multiple benefits to the state with special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *