కరెంటు ఉచ్చులకు బలౌతున్న జనం-నాడు మునేంద్ర, భీరమ్మ
– నేడు మేఘనాధం
-హద్దుల దాటుతున్న వేటగాళ్ళు
-అటవీ, విద్యుత్‌శాఖల నిర్లక్ష్యం
– ఇప్పటి వరకు 13 మంది మృతి
పుంగనూరు ముచ్చట్లు:

అడవి జంతువులకు ఆరగించేందుకు , పంటలను కాపాడుకునేందుకు కొంతమంది విద్యుత్ వైర్లను పొలాలకు కంచెలుగా వేయడంతో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అటవీ, విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీని కారణంగా ఆ కుటుంభాలు వీధిన పడుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసినా సరైన శిక్షలు పడకపోవడంతో వేటగాళ్ళు హద్దులు దాటుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
విద్యుత్ చౌర్యం ఇలా…
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలంలోని పలు గ్రామాలు, బంగారుపాళ్యెం, కుప్పం, గుడిపల్లి, పలమనేరు అటవీప్రాంతాలు అధికంగా ఉన్నాయి. అడవి జంతువులను వేటాడేందుకు వేటగాళ్ళు అటవీప్రాంతంలో 11కెవి విద్యుత్ తీగల నుంచి కరెంటును చౌర్యం చేసి , అటవీప్రాంతంలో వేయడం జరుగుతోంది. అలాగే కొంత మంది అటవి భూములను ఆక్రమించుకున్న రైతులు తమ పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ వైర్లను కంచెలుగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా రాత్రి పూట ఆప్రాంతాల్లో సంచరించే అమాయక జనం కరెంటు షాక్‌కు గురై మృత్యువాత పడుతున్నారు.
మృతుల వివరాలు…
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లె మండలం శెట్టిపేట గ్రామంలో మునేంద్ర, భీరమ్మ అనే దంపతులు విద్యుత్‌షాక్‌కు గురై ఈనెల 17న మృతి చెందారు. అలాగే తవనంపల్లె మండలంలో ప్రత్యేక ప్రతిభావంతుడైన మేఘనాధం (20) ఈనెల 23న మృతి చెందాడు. అలాగే పలమనేరు సబ్‌డివిజన్ పరిధిలో 9 మంది ఈవిధంగా మృత్యువాత పడ్డారు. ఇలాంటి వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.
కేసుల నమోదు…
ఈ విధంగా విద్యుత్‌చౌర్యంతో అమాయకుల ప్రాణాలు బలిగొన్న వారిపై పోలీసులు ఇప్పటి వరకు 96 మందిపై కేసులు నమోదు చేశారు. కానీ శిక్షలు నామమాత్రం కావడంతో నిందితులు అప్పటికప్పుడే బెయిల్‌పై విడుదలౌతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం…
విద్యుత్‌చౌర్యం జరిగే సమయంలో కరెంటు కట్ కావడం జరుగుతోంది. కానీ ఇలాంటి సంఘటనలు రాత్రిపూట జరుగుతున్నా ఆశాఖాధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం, వేటగాళ్లతో లాలూచిపడటంతో విద్యుత్‌చౌర్యం నిరాటంకంగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. అలాగే అటవీప్రాంతంలో బీట్ డ్యూటీలు నిర్వహించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా తెలిసి తెలియనట్లు ఉండిపోవడంతో ఇలాంటి సంఘటనలు తీవ్రమౌతున్నాయి. ఈవిషయమై అటవీ, విద్యుత్‌శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఇలాంటి వాటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
కఠిన చర్యలు …
పొలాలకు, అటవి జంతువుల వేటకు విద్యుత్ కంచెలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశించారని పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. వేటగాళ్లపైన ఐపిసి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి , అలాగే షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. ఇలా విద్యుత్‌చౌర్యానికి పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్న వారి గురించి సమాచారం అందించాలని కోరారు.
– సుధాకర్‌రెడ్డి, డిఎస్పీ, పలమనేరు.
Tags; Munendra and Bhiramma are the people who are subject to electric shocks
