జగిత్యాలలో మున్సిపల్ వార్
కరీంనగర్ ముచ్చట్లు:
జగిత్యాల మున్సిపాలిటీకి కేన్సర్ జబ్బు పట్టింది. నయం చేసేందుకు మందులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ ఇలా అన్నది మరెవరో కాదు.. స్వయంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇటీవల ఆయన అన్న మాటలు అప్పట్లో సంచలనంగా మారాయి. అనేక అవినీతి ఆరోపణలతో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న జగిత్యాల మున్సిపాలిటీలో మరో కొత్త పంచాయతీ తెరమీదకు వచ్చింది. తరచుగా ఏదోక సమస్యతో సతమతమవుతూ వార్తల్లో నిలుస్తున్న జగిత్యాల బల్దియాలో ఈ సారి మాత్రం మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ కమిషనర్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడటంతో అటు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.కమిషనర్, చైర్పర్సన్ ఇద్దరి సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పటికీ ఏదో వంకతో మళ్ళీ మళ్ళీ కమిషనర్ రాత్రి వరకు సమీక్షలు నిర్వహించడం పట్ల చైర్పర్సన్ భోగ శ్రావణి అసంతృప్తి వ్యక్తం చేశారని వినికిడి. మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి ఇటీవల పలు సందర్భాల్లో కింది స్థాయి సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు మున్సిపల్‌లో కొంతమంది కింది స్థాయి సిబ్బంది వరుసగా సెలవులు పెట్టి వెళ్తుండటం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది. చిరు ఉద్యోగుల పట్ల పై అధికారులు వ్యవహారిస్తున్న తీరుపై కొంతమంది సిబ్బంది మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మున్సిపల్‌లోని ఓ కీలక శాఖలో పని చేస్తున్న ఉద్యోగిపై కమిషనర్ వ్యవహరించిన తీరుపై సదరు ఉద్యోగి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే కొంతమంది కౌన్సిలర్ల జోక్యంతో ఆ వివాదం అక్కడితో సద్ధుమణిగిందిమున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణికి సరైన గౌరవం ఇవ్వకుండా కౌన్సిలర్‌లకు చెల్లించే గౌరవ వేతనం చెల్లింపు విషయంలోనూ కమిషనర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని, కొన్ని కీలక విషయాలల్లో సైతం చైర్పర్సన్‌కు, కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటూ తమను కించపర్చే విధంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్‌లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

కౌన్సిల్ అభిప్రాయం తీసుకోకుండానే ఔట్సోర్సింగ్‌లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించడం లేదా పని చేస్తున్న శాఖను మార్చడం పట్ల చిరు ఉద్యోగులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారని, ఇలా అయితే పని చేయలేమని ఉద్యోగాలు మానేసేందుకు సైతం సిద్ధపడ్డట్లు తెలిసింది. ఇలా అయితే పట్టణ అభివృద్ధి కుంటుడుతందని కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలనీ మున్సిపల్ చైర్పర్సన్‌తో పాటు కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సంజయ్‌ను కోరినట్లు సమాచారం.మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల చైర్పర్సన్ శ్రావణి బుధవారం కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌లో జరుగుతున్న పరిణామలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పటికే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వివాదం ఇంతటితో సద్దుమనుగుతుందా? లేక కమిషనర్‌ను సరెండర్ చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Tags: Municipal War in Jagitya
