ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ లో ముసలం..!

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆ ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ రూపంలో ముప్పు పొంచి ఉందా..? నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకుతోడు.. హైకమాండ్‌కు ఛైర్‌పర్సన్‌ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోందా..? కౌన్సిల్ మొత్తం పార్టీ పెద్దలను కలిసి ఏమని ఫిర్యాదు చేసింది? పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎందుకు సీరియస్‌ అయ్యారు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం?ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌లో రాజకీయ ముసలం ముదిరింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్రవంతిల మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది పరిస్థితి. మున్సిపల్‌ కమిషనర్‌ దగ్గర మొదలైన గొడవ.. అటు తిరిగి ఇటు తిరిగి గాలి దుమారంగా మారి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కు ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఆయన ఆరా తీయడం.. ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గులాబీ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.మున్సిపల్‌ కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది ఛైర్‌పర్సన్‌ స్రవంతి.. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ఆరోపణ. ఉన్నట్టుండి.. స్రవంతి అవినీతికి పాల్పడ్డారని 14 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడంతో రాజకీయ వేడి రగిలింది. కలెక్టర్‌కు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ మున్సిపల్‌ ఆఫీసును సందర్శించి రికార్డులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. ఆపై స్రవంతికి షోకాజ్‌ నోటీసు జారీ అయ్యింది. దీంతో ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ రాజకీయాలు ఒక్కసారిగా

 

 

రచ్చకెక్కాయి.మున్సిపల్ కమిషనర్‌ యూసఫ్‌ అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారనేది ఛైర్‌ పర్సన్‌ స్రవంతి ఆరోపణ. తాను ఎస్టీ సామాజికవర్గం కావడంతో గౌరవం ఇవ్వడం లేదని ఆమె వాపోతున్నారు. అయితే తాజా ఎపిసోడ్‌ వెనక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాత్ర ఉందని స్రవంతి అనుమానిస్తున్నారట. సమస్యను అక్కడితో వదిలిపెట్టకూడదని నేరుగా.. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌.. మంత్రికు ఆమె ఫిర్యాదు చేశారు. అన్నీ అంశాలు విన్న తర్వాత.. బుడగ జంగాలు సామాజికవర్గానికి చెందిన  మహిళా ప్రజాప్రతినిధిని వేధించడం సరికాదని భావించిన ఆయన.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారట. మున్సిపల్‌ కమిషనర్‌ రాజకీయాలకు అతీతంగా పనిచేసేలా చూడాలని మున్సిపల్‌ ఉన్నతాధికారులను కేటీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.తాజా రగడలో విపక్షాలు కూడా ఎంట్రీ ఇచ్చేశాయి. టీఆర్‌ఎస్‌లోని కొందరు 2 కోట్ల అవినీతి అని ఆరోపణలు చేయడంతో.. కాంగ్రెస్‌, బీజేపీలకు అవి అస్త్రాలుగా మారాయి. దాంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతలో పాలనా వ్యవహారాల్లో కమిషనర్‌ తనకు సహకరించడం లేదని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు ఛైర్‌పర్సన్‌ స్రవంతి. మీడియా ముందు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  వచ్చే ఉత్తర్వుల సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది స్రవంతి వాదన. కమిషనర్‌ ఎప్పుడు ఆఫీసుకు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని చెప్పారామె. ఇదంతా ఎమ్మెల్యే వెనకుండి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో ఈ ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే పాత్రపై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. సమస్యకు ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.

 

Tags: Musalam in Ibrahimpatnam TRS..!

Leave A Reply

Your email address will not be published.