ఇంటిబాధ  ఇంతింతకాదయ.. (పశ్చిమగోదావరి)

 Date:23/10/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలోని మూడు పట్టణాల్లో అందరికీ గృహాలు పథకం మొదటి వాయిదా సొమ్ము చెల్లించేందుకు లబ్ధిదారుల్లో  అత్యధికులు అప్పు చేయాల్సి వచ్చింది. తాజాగా మిగిలిన మూడు వాయిదాల సొమ్మును కట్టాలనడంతో అధిక మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని అందరూ దిగాలు చెందుతున్నారు. పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఎన్టీఆర్‌ నగర్‌ కింద ఆయా ప్రాంతాల్లో జీప్లస్‌ త్రీ విధానంలో బహుళ అంతస్థుల భవనాల రూపంలో గృహాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ సంస్థకు నిర్మాణ బాధ్యతను అప్పగించడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని గృహాలు పూర్తయ్యాయి. ఇటీవల మూడు పట్టణాల్లోనూ లబ్ధిదారులకు ఇళ్ల ప్లాట్లు కేటాయించారు. బ్యాంకు రుణాలకు లబ్ధిదారుల హామీపత్రం ఒప్పందం జరిగేందుకు పురపాలక అధికారులు దృష్టి సారించారు. ఇదే సమయంలో లబ్ధిదారులు వాయిదా సొమ్మును   చెల్లించాలని చెబుతున్నారు.
పాలకొల్లు మున్సిపాలిటీలో కేటగిరి రెండు, మూడు ఇళ్లకు సంబంధించిన మూడు వాయిదాల సొమ్మును ఏక మొత్తంలోగాని, రెండు దఫాలుగాగాని చెల్లించాలని అధికారులు ప్రకటించారు. దీంతో లబ్ధిదారులంతా అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లోనూ వాయిదాల సొమ్ము చెల్లించాలనే ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి వాటా సొమ్ము రూ.500ను ఒకేసారి చెల్లించారు. మిగిలిన 360, 430 చదరపు అడుగుల గృహాలకు రూ.50 వేలు, రూ.లక్షను నాలుగు వాయిదాలుగా వెసులుబాటును కల్పించడంతో మొదటి వాయిదా సొమ్మును చెల్లించారు. ఇప్పుడు ఈ రెండింటికి మిగిలిన రూ.37,500, రూ.70 వేలు చొప్పున చెల్లించాలి. ఈ మొత్తం సమకూర్చుకోవాలంటే కష్టమేనని లబ్ధిదారులు చెబుతున్నారు. వీరిలో అధిక మంది పేద, మధ్యతరగతి వర్గాలే. కనీసం సొంతిల్లు లేక అద్దింట్లోనే కాలం గడుపుతున్నారు. ఓపక్క ఇల్లు వచ్చిందనే ఆనందం కన్నా చెల్లించాల్సిన సొమ్మును ఎలా తీసుకురావాలో తెలియక దిగులే అధికమైందంటున్నారు.
లబ్ధిదారుల్లో అత్యధికులు అధిక వడ్డీలకు అప్పులు చేయాలని చూస్తున్నారు. మొదటి వాయిదా సొమ్ము చెల్లించిన సమయంలోనే కొందరు వడ్డీకి అప్పు చేశారు. అదే ఇంకా తీరలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన మూడు వాయిదాల సొమ్మును చెల్లించాలంటే అప్పు పుడుతుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు. అప్పు కోసం వెళితే తనఖాకు ఏ ఆస్తి పెడతారని అడుగుతున్నారని.. సొంతిల్లు లేకే అద్దింట్లో ఉంటున్నామని.. ఇటువంటి పరిస్థితుల్లో అప్పు ఇవ్వడంలేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వీరి పరిస్థితిని ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు నెలకు రూ.లక్షకు రూ.6 నుంచి రూ.10 వరకు వడ్డీని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు ప్రామిసరీ నోటుపై కుటుంబంలో దంపతులిద్దరి సంతకాలు తీసుకుంటున్నారు. కొందరు గత్యంతరం లేక అధిక వడ్డీల వైపు పరుగులెడుతున్నారు.
Tags:My husband’s dream come true .. (west coast)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *