ఏపీ గ్రామాల్లో మైకుల హోరు

Mycology is a field in AP villages

Mycology is a field in AP villages

Date:23/07/2018
విజయవాడ ముచ్చట్లు:
ఒకవైపు ముమ్మరంగా వర్షాలు పడుతుండటంతో పల్లెలన్నీ పొలం పనుల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు మైకులహోరు.. డప్పుల జోరు మొదలైపోయింది. రంగురంగుల జెండాలు, రకరకాల మనుషులు పల్లెల్లో ప్రవేశిస్తున్నారు. ఎలాగైనా ఆకట్టుకుని నాలుగు ఓట్లు రాల్చుకోవాలన్న తపనతో తహతహలాడుతున్నారు. ముందస్తు ఎన్నికలొస్తున్నాయని, ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపిందని ప్రచారం సాగుతోంది. దీనికి తోడు టీడీపీ, బీజేపీ మధ్య స్నేహం చెడిపోవడంతో.. ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ రెండు పార్టీలు జనక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే మూడుసార్లు శ్రీకాకుళం జిల్లాను చుట్టేశారు. ఒక సారి ఇచ్ఛాపురం, మరోసారి సారవకోట, ఇంకోసారి ఆమదాలవలస వచ్చారు. అలాగే.. ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ సీతంపేట పర్యటనకు వచ్చి.. చెప్పాల్సింది చెప్పి వెళ్లారు. ఈసారి సీఎం పక్కా ప్రణాళికతో వస్తున్నారు. శ్రీకాకుళం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూర్తిస్తారని ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో కెల్లా.. టీడీపీ అత్యంత ధనిక పార్టీ అని ఇటీవల వెలువడిన ఓ సర్వే తెలిపింది. దాంతో.. ఎన్నికలకు ఇప్పటినుంచే పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పుట్టగతుల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా మళ్లీ కాస్త బలపడాలని ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే.. ఏఐసీపీ నేత, కేరళ మాజీ సీఎం ఊమెన్‌చాందీ, మరో ఏఐసీసీ నేత క్రిస్టోఫర్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సుడిగాలి పర్యటనలు జరుపుతూ.. క్యాడర్‌లో నూతనోత్తేజం నింపుతున్నారు. గతంలో పార్టీని వీడిన వారంతా..తిరిగిరావాలని పిలుపునిస్తున్నారు.రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తామూ పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎన్నికల కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు ముందే చెప్పారు. వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా జిల్లాల్లో పర్యటిస్తూ.. కేడర్ మొత్తాన్ని ఏకం చేస్తున్నారు. బూత్ కమిటీల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే ప్రయత్నాల్లో పడ్డారు. ఎలాగైనా తమ ఉనికి చూపించుకోవాలని తాపత్రయ పడుతున్నారు.ఇక వైసీపీ తీరే వేరు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలపై మాజీ మంత్రి, వైఎస్ అనుంగు అనుచరుడైన ధర్మాన ప్రసాదరావుకు గట్టి పట్టుంది. కానీ.. పార్టీ అధిష్ఠానానికి ఆయనపై ఏమాత్రం నమ్మకం ఉందో అర్థం కాదు. టీడీపీకి కంచుకోట లాంటి సిక్కోలు జిల్లాలో రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన 9 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారు. కానీ ఇప్పుడు ఆయనకు కూడా టికెట్ వస్తుందన్న విశ్వాసం పూర్తిగా లేదంటున్నారు. కానీ.. జగన్ పాదయాత్ర వచ్చే సమయానికి పార్టీ పరిస్థితి కూడా మారే అవకాశాలు లేకపోలేవు. జిల్లాల వారీగా వరుసగా పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వస్తుండటం.. పైపెచ్చు పాదయాత్ర ముగిసేది కూడా ఇక్కడే కావడంతో అప్పటికి పార్టీ ఊపందుకునే అవకాశాలూ లేకపోలేవు. ఇప్పటికే నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్తున్నారు. వీరి సభలకు సైతం జనం బాగానే వస్తుండ టం కాస్త ఆశాభావాన్ని కల్పిస్తోంది. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి దూకిన పవన్‌కల్యాణ్ పార్టీ జనసేన రూటే వేరుగా ఉంది. ఆయన సమస్యలపై పోరాడుతానంటూ.. దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన జిల్లా పర్యటన పాక్షికంగా విజయవంతమైంది. ఇచ్ఛాపురం కిడ్నీ సమస్యపై ఆయన చేసిన దీక్ష ప్రజలను కదిలించింది. ఓట్లు సాధించే మాట ఎలా ఉన్నా.. ముందుగా జనంలోకి చొచ్చుకుపోయేందుకు జనసేన వ్యూహం రచిస్తోంది. సొంతంగా నెగ్గకపోయినా, ఎవరి ఓట్లకు గండికొడుతుందోనని ప్రధాన పార్టీలు రెండు తల పట్టుకుంటున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకుంటానంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్షేత్ర స్థాయి పర్యటనలు జరుపుతున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేకపోయినా.. జనం మాత్రం ఆయన కార్యక్రమాలకు బాగానే వస్తున్నారు. ఇక నిరంతరం ఉద్యమాల్లో నిమగ్నమయ్యే వామపక్షాలు.. ఈ సారి జనసేనతో కలుస్తామంటున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనలు విజయవంతం చేసేందుకు ఈ పార్టీలు విశేష కృషి చేస్తున్నాయి.ఇలా మొత్తం ఎన్నికల వాతావరణం ముంచుకు రావడంతో వివిధ పార్టీల్లోని కార్యకర్తలకు మంచి టైమొచ్చింది. తమకు కావల్సిన పనులు ఇప్పించకపోతే.. పార్టీ మార్పు తప్పదని నాయకులను బెదిరిస్తున్నారు. బూత్ స్థాయి వరకు కార్యకర్తల బలం ఇప్పుడు కీలకం కావడంతో అంతా వారిని బుజ్జగిస్తున్నారు. కాస్త బలమైన ద్వితీయశ్రేణి నాయకులకు ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి.
ఏపీ గ్రామాల్లో మైకుల హోరు https://www.telugumuchatlu.com/mycology-is-a-field-in-ap-villages/
Tags:Mycology is a field in AP villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *