కొత్త సోయగాలతో నల్లమల్ల

కర్నూలు ముచ్చట్లు:


కర్నూలు జిల్లాలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న చిరుజల్లులతో నల్లమల అడవులు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ప్రకృతి ప్రేమికులను అందాలతో కట్టిపడేస్తున్నాయి. కాశ్మీర్, ఊటీ లాంటి ప్రదేశాలను మైమరిపిస్తున్నాయి. తాజా వాతావరణం తో నల్లమల గుండా ప్రయాణించేందుకు పర్యాటకులు అత్యంత ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే మరీ పని గట్టుకు వెళ్ళి అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. జీవ వైవిధ్యానికి పుట్టినిల్లు అయిన నల్లమలలో ప్రయాణానికి ప్రకృతి ప్రేమికులు మిక్కిలి మక్కువ చూపిస్తున్నారు. కర్నూల్ నుంచి గుంటూరుకు వెళ్ళే రహదారిలో ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు 60 కిలోమీటర్లు, నంద్యాల నుంచి గిద్దలూరు వరకు సుమారు 50 కిలోమీటర్లు నల్లమల అడవుల గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రయాణమే అటు ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు కొత్త అనుభూతిని నింపుతోంది. మరోపక్క నల్లమల్ల సమీప ప్రాంతాల్లో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిలం, సంగమేశ్వరం, కొలనుభారతి, నవనందులు, గుండ్ల బ్రహ్మేశ్వరం, ఓంకారం ఇలా పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన వారంతా ఈ నల్లమల గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ మరిచిపోలేని అనుభూతికి లోనవుతున్నారు పర్యాటకులు. నల్లమల అందాలను మరింత మంది వీక్షించే లా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

 

Tags: Nallamalla with new soy beans

Leave A Reply

Your email address will not be published.