Natyam ad

కొడాలికి నందమూరే అస్త్రమా…?

విజయవాడ ముచ్చట్లు:


కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా  గెలుస్తూ వస్తున్న మాజీ మంత్రి కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే చెక్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు.  నోటికి హద్దు, అదుపూ లేకుండా బూతుల పురాణంతో  తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విరుచుకు పడే కొడాలి నాని మళ్లీ అసెంబ్లీ ముఖంగా చూడకుండా చేయాలన్న లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు.కొడాలి నానికి చెక్ పట్టేందుకు ఆయన ఈ సారి   ‘నందమూరి అస్త్రాన్ని’ సంధించనున్నారని తెలుగుదేశం వర్గాల్లో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత కాలం కొడాలి నాని విజయాలకు వెనుక నందమూరి హరికృష్ణ,  జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పాత్ర భారీగా ఉంటూ వస్తోందనేది కాదనలేని సత్యం.  కొడాలి నానికి ఓట్లు వేయడంలో గానీ, వేలాది మంది చేత ఓట్లు వేయించడంలో గానీ   హరికృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా కృషి చేశారని  చెబుతారు.  కొడాలి నానికి కలిసివస్తున్న ఈ పాయింట్ నే బ్రేక్ చేయాలని టీడీపీ  అధినేత వ్యూహాలు రచిస్తున్నారని  అంటున్నారు.  నందమూరి హరికృష్ణ కుమార్తె, జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసినిని వచ్చే ఎన్నికలలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపితే కొడాలి నాని హవాకు ఫుల్ స్టాప్ పడటం ఖాయమని ఆయన భావిస్తున్నారంటున్నారు.  కొడాలి నాని చాలా కాలం పాటు చంద్రబాబు వద్దే ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరిన తర్వాత అంతటి సుదీర్ఘ రాజీకీయ అనుభవం ఉండి, సీఎంగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబుపై కొడాలి నాని ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు.

 

 

 

అలాంటి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో గుడివాడలో గెలవనివ్వకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నానిని ఓడించాలంటే ఈసారి బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు.ఆ క్రమంలో తొలుత హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కుమారుడు, తనకు స్వయానా బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణను పోటీలో పెడితే ఎలా ఉంటుందని యోచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే   ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమతో కొడాలికి చెక్ పెట్టాలని కూడా యోచించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.  అంతకు ముందు గత ఎన్నికల్లో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన రావి వెంకటేశ్వరరావునే బరిలో దింపాలని చంద్రబాబు యోచించారని,  అయితే.. కొడాలి నానిని ఢీకొట్టాలంటే.. వెంకటేశ్వరరావు బలం, బలగం సరితూగకపోవచ్చన్న అనుమానం వ్యక్తం కావడంతో మరో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే పలు ఆప్షన్స్ ను యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మథనంలో, ఆ యోచనలో నుంచే నందమూరి సుహాసిన పేరు బయటకు వచ్చిందంటున్నారు..

 

Post Midle

కొడాలి నానిపై నందమూరి సుహాసినిని బరిలో దింపాలనే నిర్ణయానికి చంద్రబాబు దాదాపు వచ్చేశారనీ, దీని వెనుక  పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరు గుడివాడ నియోజవర్గంలోనే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ అంటే ప్రాణాలు ఇచ్చే కేడర్ కు కొదవలేదు. పైగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణకు కూడా గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండేది. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఇప్పుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలో దిగితే.. అటు హరికృష్ణ మీద ఉన్న సానుభూతి, ఇటు ఎన్టీఆర్ అభిమానుల మద్దతు  ఆమెకు పుష్కలంగా ఉంటాయన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు కొడాలి గెలుపుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానుల ఓట్లు కొడాలి నానికి కాకుండా సుహాసినికి పడే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

 

 

 

 

తమ అభిమాన నేతలు హరికృష్ణ కుమార్తె, ఎన్టీఆర్ మనవరాలు అయిన సుహాసినికే వారంతా మద్దతుగా నిలిచే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇంకో పక్కన కొడాలి నాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉంటారని చెబుతారు. ఇప్పడు స్వయంగా ఆయన   సోదరి సుహాసినే   పోటీకి దిగితే.. జూనియర్ కచ్చితంగా ఆమె పక్కనే నిలబడతారనే అంచనా ఉంది. నందమూరి మరో హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా సుహాసినికి తోడ బుట్టిన సోదరుడు. దాంతో కళ్యాణ్ రామ్ మద్దతు కూడా కచ్చితంగా సోదరి సుహాసినికే ఉంటుందని అంటున్నారు. ఇంతకాలంగా కొడాలికి దక్కుతున్న నందమూరి అభిమాన ఓట్లకు గండికొట్టి, ఆయనను ఓటమిపాలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నందమూరి సుహాసినిని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.కొడాలి నాని గుడివాడలో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంటే ‘నందమూరి అస్త్రాన్ని‘ సంధించడమే ఉత్తమం అని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

 

Tags; Nandamure astra to Kodali…?

Post Midle

Leave A Reply

Your email address will not be published.