నల్లారి బాటలో నారా…

Date:13/04/2018
తిరుపతి ముచ్చట్లు:
చంద్రబాబు మరో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగా మారుతున్నారంటూ… సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగేది… అప్పుడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అంతా తెలుసు.. రాష్ట్రం విడిపోతుందన్న సంకేతాలు  నల్లారికి వెళ్లాయి. అయినప్పటికి నల్లారి రాష్ట్రం విడిపోదంటూ చివరి వరకూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ..ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని, ఏపీని ఫుల్లుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు, మోడీ జోడీ రాష్ట్రమంతా తిరిగి చెప్పి విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి గురించి పెద్దగా కేంద్రం పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ మట్టి, నీళ్లు తెచ్చినప్పుడే అందరికీ అర్థమయింది. అయినా చంద్రబాబు నాలుగేళ్లు కలిసి కాపురంచేశారు. మోడీ విజన్ ను మెచ్చుకున్నారు. తీరా ఎన్నికల సమయానికి వచ్చే సరికి మోడీ హ్యాండ్ ఇచ్చేశారని, ప్రత్యేక హోదా కావాలంటూ జనం బాట పట్టే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. అప్పటి  పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వదిలేయడమే కాదు… సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. తాను ఎంత చేసినా రాష్ట్ర విభజనను ఆపలేకపోయానని, కాంగ్రెస్ నేతలే కొందరు కుట్రలు చేసి రాష్ట్రాన్ని విభజించారని నల్లారి ఊరూ వాడా తిరిగి చెప్పుకున్నారు. కాని ప్రజలు నల్లారి మాటలను నమ్మలేదు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఒక్క పీలేరు మినహా ఎక్కడా ఆయన పార్టీ ఊసే కనపడ లేదు. ఇప్పడు ఏపీ సీఎం  చంద్రబాబు నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి…అఖిల పక్షాలు, ధర్నాలు ఎందుకని ప్రజల నుంచి విన్పిస్తున్న ప్రశ్న. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి వాటిపై శ్రద్ధ పెట్టకుండా, కనీసం రాజధాని నిర్మాణంపై కూడా చంద్రబాబు దృష్టి సారించలేదన్నది ఆయనపై వస్తున్న విమర్శ. అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తారనుకుంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిలో కూడా రాజధాని నిర్మాణం చేపట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇలా చంద్రబాబు జవాబు చెప్పుకోలేని పరిస్థితి కన్పించింది. ఆరోజు కూడా నల్లారి సభలకు పెద్దయెత్తున జనం వచ్చారు. కాని ఆయన పార్టీ గుర్తుపై మీట నొక్కలేదు. రేపు కూడా చంద్రబాబుకు నల్లారి పరిస్థితి వస్తుందా? అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లోనూ లేకపోలేదు.
Tags: Nara …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *