Natyam ad

పాలమూరు జిల్లాలో బరిలో నరేంద్ర మోడీ  ?

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:


రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. స్పెషల్ ఫోకస్ పెట్టి పార్టీపరంగా, ప్రభుత్వపరంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఇక్కడ ప్రజల్లో ఆయన పట్ల ఆదరణ మరింత పెరుగుతునట్టు జాతీయ నాయకత్వం బలంగా విశ్వసిస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వచ్చే లోపు మోడీ పలుమార్లు తెలంగాణలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తరచూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్లకు కూడా చాన్స్ ఉంది.మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ దిశ ప్రచురించిన కథనంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.

 

 

 

జిల్లాలో ఏ నోటా విన్నా అదే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు టీడీపీ.. తర్వాత కాంగ్రెస్… ఇప్పుడు బీఆర్ఎస్‌కు అండగా నిలిచిన ఉమ్మడి పాలమూరు జిల్లా… ప్రధాని పోటీ చేస్తే తప్పకుండా రాజకీయంలో అనుహ్యమైన మార్పులు చేర్పులు ఉంటాయని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారే కాకుండా.. సాధారణ జనం సైతం అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు పాలమూరు గోస తీరాలంటే తెలంగాణ రావాలి అని ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకొని ఏకంగా 14 స్థానాల్లో 13 స్థానాలను దక్కించుకుంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో అధికార పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా రూపొందింది. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సాధించకపోవడం, వలసలు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గకపోవడం, స్థానిక నాయకత్వంపై పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం బీఆర్ఎస్‌కే దక్కుతుందని ప్రచారం జరుగుతుంది.

 

 

 

Post Midle

ఈ నేపథ్యంలో పాలమూరు నియోజకవర్గం నుంచి స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగే యత్నాలు జరుగుతున్నాయని ‘దిశ’ పత్రిక ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం కలిగించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటిదాకా మహబూబ్ నగర్, కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో కొంత పట్టు ఉన్న బీజేపీ పాలమూరు లోక్ సభ నియోజకవర్గ బరిలో ప్రధానమంత్రి మోడీ నిలుస్తారు అన్న ప్రచారం సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయన నియోజకవర్గాల్లో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలలోనూ మోడీ పాలమూరు నుంచి పోటీ చేసే అంశంపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు నుంచి పోటీ చేస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి తెలంగాణ సాధించానని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి అన్యాయం చేశాడు. ప్రధానమంత్రి పోటీలో ఉంటే దగ్గర ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.అధికార పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారు. ఈ సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగాను రాజకీయంగా పెను మార్పులు సంభవించడం ఖాయం.

 

 

ఈ నెల 19న నగరానికి   మోడీ
మోడీ ఈ నెల 19న నగరానికి రానున్నారు. సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రారంభించేందుకు వస్తున్నారని రైల్వే వర్గాల సమాచారం. ప్రధాని టూర్‌కు సంబంధించి ఇంకా నిర్దిష్ట షెడ్యూలు రాలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పలు కారణాల వల్ల 19వ తేదీన ప్రధాని పర్యటన రద్దయితే 20వ తేదీన ఫిక్స్ అయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రారంభించిన అనంతరం స్టేషన్ రీ డెవలప్‌మెంట్ పనులకు సైతం ప్రధాని శ్రీకారం చుట్టునున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ స్టేషన్‌ల మధ్య పూర్తయిన డబుల్ లైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. రిమోట్‌లో కాజీపేట ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్ షాపుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విజయవాడ మద్య నడిపేలా రైల్వే శాఖ గతంలో ప్లాన్ చేసింది. దానికి తగినట్లుగానే ట్రాక్ సామర్థ్యం గురించి అధ్యయనం చేసింది. ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా.. సికింద్రాబాద్-కాజీపేట-విజయవాడ మార్గంలో మాత్రం 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాక్ తట్టుకుంటుందని, గతంలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను 110 కిలోమీటర్ల వేగంతో నడిపి ప్రయోగాత్మకంగా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు వందేభారత్ రైలును సైతం తొలుత 130 కిలోమీటర్ల వేగంతో మొదలుపెట్టి టెక్నికల్, మెకానికల్ క్లియరెన్స్ తర్వాత క్రమంగా 180 కిలోమీటర్ల వేగం వరకూ తీసుకెళ్లాలని అధికారులు ఆలోచిస్తున్నారు.సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ స్టేషన్ల మధ్య డబుల్ లైన్ పనులు గతంలోనే పూర్తయినందున ఈ మార్గాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.

 

 

 

 

ఇటీవలే ఈ మార్గంలో రైళ్లను నడిపి కమిషనింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్‌మెంట్ (ఆధునికీకరణ) ప్రాజెక్టులో భాగంగా రూ.700 కోట్లతో చేపట్టిన పనులకు సైతం ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. కాజీపేటలో నెలకొల్పనున్న పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వ్యాగన్ వర్క్ షాపు యూనిట్‌కు రిమోట్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఖరారు చేసింది. ఒకే పర్యటన సందర్భంగా నాలుగు పనులకు శ్రీకారం చుట్టేలా ప్రధాని మోడీ షెడ్యూలు ఖరారైంది. రైల్వే శాఖ అధికారుల సమాచారం ప్రకారం ప్రోగ్రామ్ మొత్తం ఈ నెల 19న ఉంటుందని, పలు కారణాల వల్ల షెడ్యూల్ రద్దయితే.. 20న ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్‌పీజీ సెక్యూరిటీ సిబ్బంది పరిశీలన, ప్రధాని కార్యాలయం అధికారుల సంప్రదింపుల తర్వాత నిర్దిష్టమైన తేదీ ఖరారు కానున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక అక్కడే చిన్నపాటి బహిరంగసభ ఉంటుందని, ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశాలు ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపారు. తెలంగాణకు రైల్వే శాఖ తరఫున ఎనిమిదన్నరేళ్ల కాలంలో మంజూరు చేసిన పనులు, కేటాయించిన నిధులు, అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను ప్రస్తావించే అవకాశముందని తెలిపారు.

 

Tags: Narendra Modi in Palamuru district?

Post Midle