జాతీయ రాజకీయాలు సరే… ఇక్కడ సంగతేంటీ

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి పూర్తిగా జాతీయ రాజకీయాలపై కేంద్రీకరించారు. జాతీయ స్థాయిలో తనకు ఏ పార్టీ నుంచీ, ఏ నేత నుంచీ సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు జాతీయ పార్టీ అంటే కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అంతే కాకుండా జాతీయ పార్టీ ఏర్పాటుపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. కొత్త పార్టీకి పేరు కూడా నిర్ణయించేశారు. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంటే టీఆర్ఎస్ ను స్ఫురింప చేసేలా పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సరే జాతీయ పార్టీ ఏర్పాటు అన్నది ఆయన అభీష్టం.. నెరవేర్చుకందామనుకుంటే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. అయితే కేసీఆర్ నిర్ణయాలకు, ఆలోచనలకూ సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతగా జాతీయ స్థాయిలో పార్టీలను కలుపుకుని కేంద్రంలో మోడీ సర్కార్ పై పోరాడటం వరకూ అయితే ఓకే.. కానీ  ఏకంగా జాతీయ పార్టీ అంటే.. టీఆర్ఎస్ ను ఏం చేయదలుచుకున్నారు. జాతీయ పార్టీ పెడితే ఆయనకు మద్దతు ఎక్కక నుంచి వస్తుంది. ఉండవల్లితో భేటీ ఆంతర్యమేమిటి?  తెలంగాణ సెంటిమెంటే తెరాసకు రాష్ట్రంలో రెండు సార్లు అధికార పగ్గాలు అందుకునే అవకాశాన్ని ఇచ్చింది.  ఇప్పుడా సెంటిమెంట్ అక్కరకు రాకుండా పోయిందా? జాతీయ పార్టీ నెపంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెడదామనుకుంటున్నారా?  ఉండవల్లి లాంటి హార్డ్ కోర్ సమైక్యవాదితో మంతనాల సారాంశమిదేనా? ప్రస్తుతం తెరాస శ్రేణులను తొలిచేస్తున్న ప్రశ్నలివే.

 

 

ఈ సందర్భంగా వారు గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాలని చేసిన ప్రయత్నం గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం విఫలం కావడం వల్లనే కేసీఆర్ మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సారథ్యం వహించారని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే అంశాన్ని కేసీఆర్ సన్నిహితుడొకరు ప్రస్తావించడాన్ని తెరాస శ్రేణుల చర్చల్లో నలుగుతోంది. కాగా కేసీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కల గురించి చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి అయితే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ తో కలిసి పని చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్  అటు తరువాత టీఆర్ఎస్ లో చేరారు.కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పింది కూడా ఈ చంద్రశేఖర్ గురించే. ఆ తరువాత కేసీఆర్ మాట తప్పారనుకోండి. అది వేరే సంగతి.  కేసీఆర్ మాట తప్పడంతో కినుక వహించిన చంద్రశేఖర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు.   ప్రస్తుతం ఆయన బీజేపీలో  ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రం నుంచీ కూడా కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. దీంతో ఉమ్మడి ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ ప్రయత్నించి భంగపడ్డారన్న ఆయన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ  సంచలనం సృష్టించాయి. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై ఈ కారణంగానే తెరాస శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టి పక్కా సమైక్య వాదితో మంతనాలు జరపడంతో ఆయన తెలుగు రాష్ట్రాలు మళ్లీ విలీనం కావడం ద్వారా తన జాతీయ పార్టీకి మద్దతు బలంగా లభిస్తుందని వ్యూహరచన చేశారు. ఒక వేళ జాతీయ పార్టీతో కేంద్రంలో చక్రం తిప్ప లేకపోయినా… తెలుగు రాష్ట్రాలలో బలపడి.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కల సాకారం చేసుకుందామని భావిస్తున్నారా?

 

 

అందుకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారా అన్న అనుమానాలను పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో తెరాసకు వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయన్న  నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంటును పట్టుకుని వేళాడితే మరోసారి అధికారం అంత తేలిక కాదని అవగతమైన కారణంగానే.. కేసీఆర్ తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ నే మరి కొంత విస్తృతం చేసి దక్షిణాది సెంటిమెంట్ ను పండించాలన్నది కేసీఆర్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో వ్యతిరేకత పెల్లుబుకుతున్నా.. తెలంగాణ అభివృద్ధిని గమనించి ఆంధ్రులు తనకు మద్దతుగా నిలుస్తారని కేసీఆర్ ఆశాభావంతో ఉన్నారుతెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కొన్ని స్థానాలను కోల్పోయినా ఆ మేరకు ఏపీలో లబ్ధి పొందే అవకాశాలుంటాయన్న అంచనాతో ఆయన జాతీయ పార్టీ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి రావడం వల్ల మాత్రమే సాకారం కాలేదనీ, వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగం అందుకు కారణమని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.   జాతీయ పార్టీ అంటూ తెరాసను గాలిలో దీపంగా వదిలేస్తే సహించేది లేదని గట్టిగా  చెబుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచనను, ప్రయత్నాలను తెరాస శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటికే ఏదో ఒక రూపంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  రానున్న రోజులలో తెరాసలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత  మరింత బలోపేతమై బహిరంగ నిరసనల రూపంలో వ్యక్తమైనా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.

 

Tags: National politics is OK … here it is