తెలంగాణ నమూనాతో‌ జాతీయ రాజకీయాలకు:కేటిఆర్

Date:15/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
కేసీఆర్ ఎజెండానే జాతీయ ఎజెండా కానుందని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పది పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నం తాము చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ సీఎంగా మోదీ…తన నమూనా పేరుతో ‌ఎలా జాతీయ రాజకీయాలకు వెళ్లారో, తెలంగాణ నమూనాతో‌ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.యూపీ, బీహార్ ఉపఎన్నికల ఫలితాలు ‌కేసీఆర్ ఆలోచన ధోరణిని ప్రజలు సమర్ధిస్తున్నట్లుగా ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలు పట్టించుకొనే పరిస్ధితి లేదన్నారు. కాంగ్రెస్ నాయకులది అధికార ఆరాటమేనన్న సంగతి ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హరీశ్‌రావు ప్రజల ఆశయాల కోసమే ఆనాడు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారన్నారు. ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే అధికారం కోసం కాంగ్రెస్ అనవసరపు రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు.జాతీయ రాజకీయాలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ సాధించి కేసీఆర్ ఋణం తీర్చుకున్నారని, భారత పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతమాత ఋణం కూడా తీర్చుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. కేసీఆర్ సరికొత్త రాజకీయాలకు దేశం యావత్తూ స్పందిస్తోందని చెప్పారు. సామాన్య ప్రజలకు ఏం కావాలో అదే కేసీఆర్ అజెండాగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ,కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని.. యూపీలో సమాజ్‌వాది పార్టీ గెలుపుతో ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఇకఫై నమ్మే స్థితిలో లేరన్నారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
Tags: National politics with Telangana model: KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *