రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు

National Women's Commission Notices for Rahul Gandhi

National Women's Commission Notices for Rahul Gandhi

Date:10/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు పంపింది. ఇటీవల రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ గాంధీ అనైతికమైన, మోసపూరితమైన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ పేర్కొంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో భాగంగా లోక్‌సభలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సీతారామన్‌ ప్రసంగించారు. రక్షణమంత్రి ప్రసంగాన్ని రాహుల్ పలు సందర్భాలలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం చర్చలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని కాపాడటానికి ఓ మహిళ వచ్చారు అని మహిళా మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘56 అంగుళాల ఛాతీగల ఓ వ్యక్తి ప్రజాకోర్టు నుంచి పారిపోయి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లారు. సీతారామన్ గారు.. నన్ను కాపాడండి.. నన్ను నేను కాపాడుకోలేను అని సాయం కోరారు.
అయితే రెండున్నర గంటల పాటు సాయం కోరిన వ్యక్తిని ఆమె రక్షించలేకపోయారు. మీరు నిజంగా ఆ వ్యక్తిని కాపాడగలిగారా అని అడిగితే ఆమె అవును లేక లేదు అని ఏ బదులు ఇవ్వలేదు. ఆమె ఆయనను రక్షించలేకపోయారు’ అని రాహుల్ అన్నారు. మహిళా మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ తప్పుపట్టారు. రాహుల్ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని, పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడటం తగదని సూచించారు. మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ నుంచి వివరణ కోరామని, మహిళలను తక్కువ చేసి మాట్లాడటంతో ఆయన ఉద్దేశమేంటో చెప్పాలని నోటీసులలో కోరినట్లు రేఖా శర్మ వివరించారు.
రక్షణమంత్రిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించిన విషయం తెలిసిందే. ‘మహిళా మంత్రి సీతారామన్ విపక్షాలను దీటుగా ఎదుర్కొన్నారు. విపక్షాలు చెప్పేవి అబద్ధాలని నిరూపించారు. దీంతో ఆగ్రహించిన విపక్షాలు రక్షణ మంత్రి మహిళ అని ఆమెను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అది కేవలం సీతారామన్‌కు జరిగిన అవమానం కాదు. మహిళా సాధికారితను ప్రశ్నించడమే. దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరించించిన విపక్ష నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని’ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Tags:National Women’s Commission Notices for Rahul Gandhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *