నట్టేటా మునుగుతున్న రైతులు

విజయవాడ ముచ్చట్లు:

రబీ పంటలు అమ్ముకుంటున్న రైతులు మౌనంగా రోదిస్తున్నారు. మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్ముకోండి, నష్టానికి అమ్ముకోవద్దని ఉన్నతాధికారులు బాహాటంగా ప్రకటనలు ఇస్తున్నా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పిపిసి) వద్ద జరుగుతున్న తంతు ప్రకటనలకు భిన్నంగా జరుగుతోంది. చూస్తూ చూస్తూ తమ రెక్కల కష్టాన్ని మిల్లర్లకు ఉచితంగా ధారబోయాల్సిన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 21.75 లక్షల హెక్టార్లలో రబీ ధాన్యం సాగైంది. దీని నుంచి సుమారుగా 41 లక్షల మెట్రిక్‌ టన్నుల పైబడి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రైతుల నుండి ధాన్యం సేకరించే పనిని నిర్వహిస్తోంది. ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతుంది, రైతులు ఆనంద పరమానందభరితులై గంతులు వేస్తున్నారని అధికారులు, ఇతర పత్రికలు ప్రభుత్వ డోలు వాయిస్తున్నా జరుగుతున్న అసలు తంతు ఇదే..రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సరిపడినన్ని గోనె సంచులు సిద్ధం చేసి ఉంచాలి. అయితే ధాన్యం అమ్ముకునేందుకు పిపిసికి వెళ్లిన రైతుకు నిరాశే ఎదురవుతుంది. ఓ పక్క కళ్లాల్లో ధాన్యం రాశులు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాల భయం, మరోపక్క దొంగల భయంతో రైతులు ధాన్యానికి కాపలా కాయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదనుగా భావించిన పిపిసి అధికారులు రైతుల దృష్టిని మిల్లర్లవైపు మళ్లిస్తున్నారు. గోనె సంచులు ఇవ్వాలంటే క్వింటాకు 10 కేజీలు తగ్గించుకోవాలనే షరతు రైతులకు విధిస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో క్వింటాకు 10 కేజీలు చొప్పున నష్టపోయి సంచులు తెచ్చుకుని ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్న విషయాన్ని రైతులు బయటకు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.రైతుతో మిల్లర్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతు కళ్లం వద్దకే లారీ వెళ్లడం, ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లడం జరుగుతోంది. వాస్తవంగా రైతు ధాన్యాన్ని గ్రామ వ్యవసాయ సహాయకులు, పిపిసి అధికారులు దగ్గరుండి తూకం వేయించి, మిల్లుకు లోడు పంపాలి.

 

కానీ ఇదేదీ ప్రస్తుతం జరగడం లేదు. ఉదాహరణకు రైతు నుంచి 100 క్వింటాళ్లు ధాన్యాన్ని మిల్లరు కొనుక్కెళితే కేవలం 90 క్వింటాళ్లే పిపిసి తనకు పంపిందని, ఆ ధాన్యం తాను తీసుకున్నానని మిల్లర్లు ఇచ్చే తప్పుడు రికార్డులు పిపిసి అధికారుల ద్వారా వైబ్‌సైట్‌లో అత్యధికంగా నమోదవుతున్నాయి. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర అందుతుందని, కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కానీ రైతు 10 క్వింటాళ్లు ధాన్యంపై వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాడని ఏ అధికారికీ కనబడడం లేదు.రైతుల కష్టార్జితాన్ని దోచుకునేందుకు పిపిసి అధికారులు, మిల్లర్లు ఉన్నతాధికారుల కళ్లుకప్పి హైటెక్‌ మోసాలకు పాల్పడుతున్నారు. మిల్లర్లు, పిపిసి అధికారులు ముందస్తు ఒప్పందాలతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద తూకం తగ్గించి కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు రికార్డుల్లో నమోదు చేసేందుకు పిపిసి అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారు. మిల్లర్లు ఇచ్చిన పత్రాలతో రైతు పిపిసి ద్వారా మద్దతు ధరకే ధాన్యం అమ్ముకున్నట్లు పిపిసి అధికారి వెబ్‌సైట్‌లో రికార్డులు నమోదు చేస్తున్నారు. దీంతో రైతు మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడని లోకానికి కనబడుతుంది. కానీ మిల్లరు 100 క్వింటాలు ధాన్యం తీసుకెళ్లి 90 క్వింటాళ్లే తనకు అందిందని ఇచ్చే దోపిడీ పత్రాలు ఎవరికీ కనబడడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి ఖర్చు తప్పడం లేదు, రైతుకు నష్టం తప్పడం లేదు. అంతిమంగా పిపిసి అధికారులు, మిల్లర్లు మాత్రం రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కానీ ఇవేవీ రైతు బయటకు చెప్పుకోలేక మౌనంగా తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ 2,14,671 మంది రైతుల నుంచి రూ.4,605.69 కోట్లు విలువ గల 24,60,158.720 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వీటి తాలూకా చెల్లింపులు, బకాయిల వివరాలు చెప్పేందుకు పౌరసరఫరాల సంస్థ ఎమ్‌డి ఎ.సూర్యకుమారి అందుబాటులో ఉండడం లేదు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Natteta drowning farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *