ప్రకృతి వ్యవసాయ రైతులు పశుగ్రాసం, కూరగాయల సరఫరాకు ముందుకు రావాలి – టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి
మన భవిష్యత్ కోసం, భక్తుల కోసం సహకారం అందిద్దాం: జిల్లా కలెక్టర్
తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ గోశాలలకు అవసరమైన పశుగ్రాసం, భక్తులకు అన్నప్రసాద వితరణకు అవసరమైన కూరగాయలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించి టీటీడీకి సరఫరా చేసేందుకు రైతులు ముందుకు రావాలని టీటీడీ ఈఓ ఎ.వి ధర్మారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం టీటీడీ ఈఓ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతు సాధికార సంస్థ అధికారులతో, ప్రకృతి వ్యవసాయ రైతులతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసం, కూరగాయలను టీటీడీకి సరఫరా చేసేందుకు సేంద్రియ రైతులతో బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటామన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న తిరుపతి, పలమనేరు, నెరబైలు వద్ద గల కమలయ్యగారిపల్లి గోశాలలకు రోజుకు 30 టన్నుల పశుగ్రాసం అవసరమవుతుందన్నారు. ఈ పశుగ్రాసాన్ని సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించాలని, టన్నుకు రూ.2 వేలకు పైగా ధర చెల్లిస్తామని తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా ఘన జీవామృతం, ద్రవ జీవామృతం ద్వారా పండించాలన్నారు. సంవత్సరం పొడవునా పశుగ్రాసాన్ని, కూరగాయలను టీటీడీకి సరఫరా చేసేలా పలువురు రైతులతో ఒప్పందం చేసుకుంటామన్నారు. రైతుల పొలాల వద్దకే వెళ్లి సేకరిస్తామని, రవాణా ఖర్చులు కూడా టీటీడీనే భరిస్తుందని చెప్పారు. అటు పశుగ్రాసం, ఇటు కూరగాయల కోసం రైతులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం సమకూరుతుందన్నారు. అంతేగాక ఈ రైతులతో సమావేశాలు, విధివిధానాల రూపకల్పన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ లోని పలు గోశాలలను మోడల్ గోశాలలుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ కృషి చేస్తోందని ఈవో వివరించారు.
జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు తక్కువగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో టీటీడీ ముందుకు రావడం సంతోషకరమన్నారు. సేంద్రియ వ్యవసాయ పంటల వల్ల మన భవిష్యత్తుకే కాకుండా రాబోయే తరాల వారికి కూడా మంచి చేసిన వారమవుతామని, భక్తులకు ఆరోగ్యకరమైన, శ్రేష్టకరమైన భోజనాన్ని అందించినవారమవుతామని చెప్పారు. ఒకసారి టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంటే పశుగ్రాసాన్ని, కూరగాయలను నిరంతరాయంగా అందించాల్సి ఉంటుందన్నారు. తద్వారా రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ల ద్వారా ఈ విషయానికి సంబంధించి త్వరలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విధానం విజయవంతమైతే దేశంలోనే ఇదొక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని తెలియజేశారు. గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ గోశాలల ఆధ్వర్యంలో రైతుల కోసం చేస్తున్న సమగ్ర ప్రణాళికను వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జెఈఓ సదా భార్గవి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ రావు, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్లు షణ్ముగం, వాసు, తిరుపతి జిల్లాలోని చుట్టుపక్కల మండలాల నుంచి విచ్చేసిన రైతులు పాల్గొన్నారు.
Tags:Natural farming farmers should come forward to supply fodder and vegetables – TTD EO AV Dharma Reddy
