ప్రతిభకు ‘నవోదయ’ పట్టం

Navodaya is the title of talent

Navodaya is the title of talent

Date:19/09/2018
కుమురం భీం ముచ్చట్లు:
ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్ధులకు జవహర్‌ నవోదయ విద్యాలయాలు నాణ్యమైన విద్యాకేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పలువురు విద్యార్ధులు ఈ స్కూళ్లలో విద్యనభ్యసిస్తూ భవితను తీర్చిదిద్దుకుంటున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఉన్న నవోదయ స్కూల్‌లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తోంది.
దీంతో పలువురు ఈ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యమిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య, ఉత్తమ సంస్కృతి విలువలను పెంపొందించాలనేదే నవోదయ విద్యాలయాల ప్రధాన లక్ష్యం. ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపికచేస్తారు.
ఇలా సెలక్ట్‌ అయిన విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య లభిస్తుంది. ఈ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లుకు ఏటా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దీనికి కోసం పోటీ తీవ్రంగా ఉంటోంది. నిరుపేద, వ్యవసాయ కుటుంబంలోని పలువురు విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఎలాంటి శిక్షణ లేకుండా ప్రతిభా ఆధారంగా విద్యాలయంలో సీటు సాధించి భేష్ అనిపించుకున్నారు.
భవితను బంగరుమయం చేసుకునే దిశగా విద్యలో రాణిస్తున్నారు. ఇక నవోదయ పాఠశాలల ద్వారా అందుతున్న నాణ్యమైన చదువు వారిని మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. చదువులోనే కాక పిల్లల వ్యక్తిత్త్వం, వికాసంపైనా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో వారు మంచి భావి భారత పౌరులుగా ఎదుగుతున్నారు.
గ్రామీణ పేద విద్యార్థులకు నవోదయ విద్యాలయంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. మంచి స్టాండర్స్ ఉన్న చదువు పల్లె విద్యార్ధులకు లభిస్తోందంటే ప్రభుత్వాల కృషే. చదువుతో పాటూ పిల్లలకు క్రీడలు, సంస్కృతి, ఎన్‌సీసీ, యోగా, చిత్రలేఖనం, పర్యావరణ తదితర అంశాల్లో ప్రత్యేక అవగాహన, శిక్షణను అందిస్తున్నారు. దీంతో వారు చదువులోనే కాక క్రీడలు, కళల్లోనూ రాణిస్తున్నారు. విద్య విషయానికొస్తే సీబీఎస్‌ఈ సిలబస్‌లో 6 నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ చదివే వీలుంటుంది.
చిన్నారుల్లో జాతీయ సమైఖ్యత భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోని నవోదయ విద్యాలయాల్లోనే మైగ్రేషన్‌ విధానం అమలు చేస్తున్నారు. 6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులు 9వ తరగతిలో సంవత్సరం పాటు మైగ్రేషన్‌పై ఇతర రాష్ట్రాల్లోని విద్యాలయంలో చదువుకోవాలి. అక్కడి విద్యార్థులు ఇక్కడి విద్యాలయానికి వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. నవోదయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థుల్లో అనేకమంది దేశవిదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
దీంతో ఈ విద్యాలయంలో సీటు సాధించడాన్ని పలువురు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకే పాఠశాలల్లో ప్రవేశం కోసం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర కసరత్తు చేస్తుంటారు. ప్రవేశ పరీక్షకు ఏడాది ముందు నుంచే పట్టణాల్లో శిక్షణ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల్లో హడావిడి మొదలైపోతుంటుంది. విద్యార్థులకు ఆకర్షించేందుకు ఉచితంగా నవోదయ శిక్షణ కేంద్రాలను పలువురు ఏర్పాటు చేస్తూ కోచింగ్‌లు ఇస్తున్నారు. గ్రామీణ పేద విద్యార్ధులకు ఆశాదీపంగా నిలిచిన ఈ నవోదయ విద్యాకేంద్రాల ద్వారా మరింత మంది వృద్ధిలోకి రావాలని అంతా ఆశిస్తున్నారు.
Tags:Navodaya is the title of talent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *