ప్రయోజనాలకోసమే ఎన్డీయోలోకి..

-కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
Date:16/03/2018
అమరావతి ముచ్చట్లు:
నాలుగేళ్లుగా ఏపీని పట్టించుకోలేదు. గట్టిగా నిలదీస్తే ఎగతాళిగా మాట్లాడారు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు శాసన మండలిలో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. నిన్న లోక్ సభలో ఫైనాన్స్ బిల్లు ఆమోదించారనీ, తాను నిన్నటి దాకా చూసింది ఫైనాన్స్ బిల్లులో ఏమైనా సవరణలు పెడతారేమోనని చూశాననీ, అటువంటిదేమీ లేకపోవడంతో ఇక తప్పదని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకానే అవిశ్వాసం పెట్టాలని భావించామని అందుకే ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టామన్నారు. ప్రయోజనాల కోసమే తప్ప పోర్టుపోలియోల కోసం ఎన్డీయేలో చేరలేదని చంద్రబాబు అన్నారు. తాను ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా విభజన చట్టంలో హామీలను అమలు చేయమనే అడిగానని, అది కూడా చేయకపోతే పోరాటం తప్ప మరే మార్గం ఉందని ఆయన ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ  ఇష్టారీతిగా మాట్లాడారని చంద్రబాబు దుయ్యబట్టారు. డిఫెన్స్ బడ్జెట్ అడిగేంత సంస్కారహీనుల్లా కనిపిస్తున్నామా అని నిలదీశారు. దేశమంటే మీకే ప్రేమా..? మాకు లేదా.. అని నిలదీసారు. సెంటిమెంట్లతో నిధులు రావని అంటారా? ఏం తెలుగువారి సెంటిమెంట్ ను పట్టించుకోరా అని ప్రశ్నించారు. తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడే బాధ్యత మామీద ఉందని అరుణ్ జైట్లీ అన్నారనీ, అంటే మీరొక్కరే దేశాన్ని కాపాడుతున్నారా, ప్రతి భారతీయుడూ దేశ రక్షణ కోసం నడుం బిగిస్తారనీ, మీ కొక్కరికే దేశ భక్తి ఉందని అనుకోకండి అని చంద్రబాబు అన్నారు. మేం అదనంగా ఏమీ అడగడం లేదని చంద్రబాబు అన్నారు. ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేస్తే పిలిచి మాట్లాడే తీరిక కేంద్రానికి లేదా..? ఏం చేస్తారులే..? చిన్న రాష్ట్రం అనే చిన్న చూపా..? ఫైనాన్షియల్ బిల్లులో కూడా ఏ మార్పు లేకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు అన్నారు. కష్టాలతో.. అప్పులతో రాష్ట్ర ఏర్పడింది. రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా..? పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను ఒకే ఏడాదిలో  ఇచ్చేస్తామని నాటి పార్లమెంటులో హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైందని నిలదీసారు. ఎవరెవర్నో నా మీదకు రెచ్చగొడుతున్నారు.. విమర్శలు చేయిస్తున్నారు. నేను దేనికీ భయపడను. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నా.. నేను దేనికీ తలొగ్గను. ప్రజల కోసం నేను ఎంతైనా కష్టపడతా. టీడీపీని దృష్టిలో పెట్టుకునే నాడు విభజన చేశారని అయన అన్నారు. ఇప్పుడూ కేంద్రం అదే తరహాలో వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజల కోసం గట్టిగా పోరాడే ప్రభుత్వం మాదని అయన స్పష్టం చేసారు.
Tags: NDO for purposes only

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *