నిర్లక్ష్యం.. నిండుగా… 

Date:17/04/2018
గుంటూరు ముచ్చట్లు:
పల్లెలు పరిశుభ్రతతోపాటు ఆదాయాన్ని గడించేలా ప్రభుత్వం పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను నిర్మింపజేస్తోంది. అందుకుగాను నిధులనూ సమకూరుస్తోంది. అయితే జిల్లాలో మాత్రం పనులు వేగంగా సాగని పరిస్థితి నెలకొంది. ఇందుకు నిదర్శనమే 521 కేంద్రాలు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు కేవలం 40 మాత్రమే పూర్తి కావడం, మరో 263 నిర్మాణంలో ఉండడం. స్థలాల కేటాయింపులో రెవెన్యూ శాఖ, నిర్మాణంలో పంచాయతీలు, డ్వామా సిబ్బంది చొరవ చూపితే గ్రామగ్రామాన వాటిని ఏర్పాటు చేయాలన్న సర్కారు లక్ష్యం ఇట్టే నెరవేరుతుందనడంలో సందేహం లేదు.ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డు పక్కనే పేడ దిబ్బలు, చెత్తకుప్పలు దర్శనమిస్తుంటాయి. అలాంటి అనారోగ్యకర పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో తొలుత ప్రతి మండలంలో ఒక పంచాయతీలో జనాభా ఆధారంగా వ్యర్థాల నిర్వహణ కేంద్రం నిర్మించేందుకు అనుమతించింది. ఆ తర్వాత సగం వాటికి అనుమతించి ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నింట్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. గ్రామంలోని కుటుంబాల -సంఖ్యనుబట్టి కేంద్రం నిర్మాణానికి రూ.25 లక్షల వరకు  మంజూరు చేసింది. రేకులతో షెడ్డు నిర్మించి లోపల కొంత భాగం తడి చెత్త వేసేందుకు వీలుగా తొట్లు నిర్మించి వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తారు. వాటి నిర్వహణకు రైతులు ముందుకొస్తే కేటాయిస్తారు. మిగిలిన భాగంలో గది ఏర్పాటు చేస్తారు. నిర్మాణం పూర్తయినా తర్వాత నిర్వహణ బాధ్యతను పంచాయతీ తీసుకుంటుంది. తడిచెత్తతో ఎరువు తయారు చేయడం, పొడిచెత్త వేరు చేసి వేరుగా విక్రయిస్తుంది. దీనివల్ల గ్రామంలో చెత్త సమస్యకు పరిష్కారం మోక్షం, పంచాయతీకి ఆదాయం సమకూరుతాయి.8 శాతం పూర్తి : జిల్లాలో 521 కేంద్రాల నిర్మాణానికి రూ.28.46 కోట్లు మంజూరుకాగా అందులో వేతనాల కింద రూ.3.6 కోట్లు, మిగిలినది సామగ్రి కోసం ఖర్చు చేస్తారు. అయితే ఇప్పటి వరకు కేవలం 40 కేంద్రాల పనులు మాత్రమే పూర్తికాగా అమరావతి, నగరం మండలాల్లో ఒక్కటీ మొదలు కాలేదు. అన్నింటికన్నా అత్యధికంగా నూజండ్ల మండలానికి 10 మంజూరుకాగా మూడు పూర్తయ్యాయి. నిధులున్నా పనులు చేయకపోవడానికి క్షేత్రస్థాయిలో పలు కారణాలు ఉన్నాయి. కేటాయించిన స్థలంలో నిర్మాణానికి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పంచాయతీ పాలకవర్గం సహకారం లేక షెడ్ల నిర్మాణం జరగకపోవడం, ఈ సంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం. పైగా ప్రభుత్వ భూములను గుర్తించి పంచాయతీకి బదలాయించడంలో రెవెన్యూ శాఖ చొరవ చూపకపోవడం. జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులు చెబుతున్నా కార్యాచరణలోకి రాకపోవడం. ఉపాధి సిబ్బందితోపాటు రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా మంచి పలితాలు రాబట్టవచ్చునని ఉద్యోగులు చెబుతున్నారు.షెడ్లు, వాటి లోపల సిమెంటు తొట్ల నిర్మాణంలో నాణ్యతపై నీలినీడలు నెలకొన్నాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లెలో నిర్మించిన షెడ్డు కప్పునకు వేసిన జమ్ము లేచిపోయింది. లోపల సిమెంటు ఇటుకతో నిర్మించిన తొట్లు నెర్రలిచ్చాయి. ఇప్పటి వరకు దానిని వినియోగంలోకి తీసుకురాలేదు. పంచాయతీకి అప్పగించామని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో తొలి విడతలో నిర్మించిన కేంద్రాల్లో ఎక్కువ శాతం వాటి పరిస్థితి ఇలాగే ఉందన్న ఆరోపణలు లేకపోలేదు.
Tags: Neglected ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *