చదువలపై నిర్లక్ష్య మబ్బులు

Date:18/09/2018
అనంతపురం ముచ్చట్లు:
కేజీబీవీల్లో ఇంటర్ చదువుకునేవారికి సమస్యలు కమ్ముకున్నాయి. తరగతులు ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. ఇంకా చాలా సబ్జెక్టులకు కనీసం ఒక్క పాఠం కూడా కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లాలో మొత్తం 61 కేజీబీవీల్లో 6 నుంచి పది తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు.
జిల్లాలో ఐదు కేజీబీవీలో మాత్రమే తాజా విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యను పెట్టారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పేద బిడ్డలకు బోధన వేదన వెంటాడుతోంది. ఇప్పటికే తరగతులు ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా బోధకుల కొరత పట్టిపీడిస్తోంది. సాధారణంగా కేజీబీవీల్లో పేద బిడ్డలే విద్యను అభ్యసిస్తారు.
వారు ఎవరికీ చెప్పలేరనే ధైర్యమో మరో కారణమో బోధకులను నియమిద్దామనే ఆలోచనను మరిచారు. ఫలితంగా విద్యార్థులకు ప్రతిబంధకంగా మారింది. ఆయా కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆఫర్‌ చేస్తున్నారు.కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఉచిత చదువు, వసతులు, భోజన సదుపాయంతో కూడిన విద్యను అందిస్తారు.
పదోతరగతి పూర్తి కాగానే తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా, నాన్నలో ఎవరో ఒకరు లేని వారు, వలస పిల్లలు, చదువు మధ్యలో మానేసిన వారంతా ఎక్కడ చదవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈక్రమంలో అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా ఐదు కేజీబీవీల్లో మొదటి సంవత్సరంలోనే ఇంటర్‌ అమలు చేస్తున్నారు. జిల్లాలోని రాప్తాడు, గుమ్మఘట్ట, పరిగి, బెళుగుప్ప, తలుపుల కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఆఫర్‌ చేస్తున్నారు.
ప్రతి కేజీబీవీలో పూర్తి స్థాయిలో జూనియర్‌ లెక్చరర్లను నియమించలేదు. ఓవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మరో వైపు పేదరికం ఇంకొక వైపు ఇంటర్‌లో ప్రవేశం పొందినా పూర్తి స్థాయిలో బోధన అందక పోవడంతో విద్యార్థులు కన్నీటిని దిగమింగుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్రత్యేక అధికారులకు చెప్పుకొన్నా ప్రయోజనం లేదనే నిరాశతో ఉన్నారు.
ప్రారంభించిన మొదటి సంవత్సరంలో బోధకుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా విద్యార్థుల ఇంటర్‌ ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే తరగతులు ప్రారంభమై రెండు నెలలు పూర్తి అయ్యాయి. ఇంకా చాలా సబ్జెక్టులకు ఒక పాఠం కూడా పూర్తి కాలేదు. పరిగిలో ఎంపీసీ, ఎంఈసీ ఆఫర్‌ చేస్తుండగా కామర్స్‌, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమాటిక్స్‌ ఏకంగా నాలుగు సబ్జెక్టులకు లేరంటే బోధన ఎలా జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేజీబీవీల్లోని విద్యార్థులకు ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. రెండు నెలలు అవుతున్నా ఇంకా అరకొరగానే సరఫరా చేశారు. ఐదు కేజీబీవీలకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదు. పుస్తకాల్లేక దిగులు ఓవైపు… లెక్చరర్లు లేక మరో వైపు విద్యార్థులు సతమతం అవుతున్నారు. అధ్యాపకులు లేకున్నా కనీసం పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఉంటే విద్యార్థులు సొంతంగా చదువు కోవడానికి అవకాశం ఉంటుంది.
Tags: Negligence on the readings (Ananthapur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *