ఏపీలో నేపాల్ తరహా వ్యవసాయం

Date:10/10/2018
కాకినాడ  ముచ్చట్లు:
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం, లాభసాటి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాయి. అయితే రైతుల ఆదాయాన్ని మూడింతలు చేసే విధానాన్ని అన్నామలై వర్సిటీ (చెన్నై)కి చెందిన అగ్రానమిస్టు ఆర్‌ఎం కతిరేశన్ రూపొందించారు. తమిళనాడులో దాదాపు 2వేల మంది రైతులు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, నేపాల్‌లోనూ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీ రైతులు కూడా దీనిపై ఆసక్తి కనబరచడం గమనార్హం. తమిళనాడులో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారం. కొన్ని కోస్తా జిల్లాల్లో మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంటుంది. దీంతో సంవత్సరానికి ఒకసారే వరి పండుతుంది. పెట్టుబడులు ఎక్కువగా ఉండటంతో అక్కడి రైతులకు వచ్చే ఆదాయం అంతంతమాత్రమే కావటంతో రైతు ఆదాయం పెంచే దిశగా ఆయన పరిశోధనలు చేశారు. వరితో పాటు కోళ్లు, చేపల పెంపకం చేపట్టే విధానాన్ని రూపొందించారు.
దీనివల్ల రైతులు మూడింతల ఆదాయం పొందే వీలుంది. తమిళనాడులో ప్రస్తుతం 2వేల మంది రైతులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది లాభసాటిగా ఉండటంతో ఇప్పుడిప్పుడే మరికొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విధానంలో పొలంలో వరి పండించటంతో పాటు కోళ్లు, చేపలు కూడా పెంచుతారు. ఒక ఎకరా పొలంలోని 90 సెంట్లలో వరి వేసి, మిగిలిన 5 సెంట్లలో కోళ్లు, చేపలు పెంచుతారు. వరి పంటను ఆనుకుని ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు ఉండేలా పొడవైన ట్రెంచ్ తవ్వుతారు. ఇందులో చేపలు పెంచుతారు. ట్రెంచ్‌లో సగ భాగం, మరో సగ భాగం పొలంలో ఉండేలా చిన్న షెడ్డును కోళ్ల పెంపకానికి వీలుగా నిర్మిస్తారు.
కోళ్ల పెంట పొలంలో, ట్రెంచ్‌లో పడేలా నిర్మిస్తారు. దీనివల్ల చేపలకు దాణా, కొంతమేర వరికి ఎరువు, తదితర పోషకాలు లభిస్తాయి. ఈ మూడూ ఒకదానితో ఒకటి కలిసి ఉండేలా నిర్మాణం ఉంటుంది.చేపల దాణా వరి పంటను తెగుళ్లు, ఇతర హానికారక కీటకాల నుంచి రక్షిస్తుంది. వరి పొలంలో నీరు ఎప్పుడూ ఉండటం వల్ల చేపలు వరి పొలంలోకి వెళ్లి, పంటకు హాని కలిగించే కీటకాలను తింటాయి. వరి చేలో నీరు తగ్గినప్పుడు అవి తిరిగి ట్రెంచ్‌లోకి వస్తాయి. కోళ్ల పెంట కూడా వరి పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కొంతమేర ఎరువులు అవసరం అవుతాయి. తరువాత వాటి అవసరం ఉండదు.
పంట కాలంలో మూడుసార్లు కోళ్లు, చేపలు విక్రయించే వీలు కలుగుతుంది. రైతులు ఉమ్మడిగా వీటిని విక్రయించి లాభాలు పంచుకోవడం ద్వారా ఆదాయం పొందుతారు. ఈ విధానం వల్ల అప్పటివరకూ 20వేల రూపాయల ఆదాయం పొందిన రైతులు ప్రస్తుతం 60వేల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు. కడలూరు, విల్లుపురం, నాగపట్టణం, తిరువణ్ణామలై జిల్లాల్లో ఈ విధానం విజయవంతమైంది. అనేక ప్రయోగాల అనంతరం బ్రాయిలర్ చికెన్ పెంపకం మేలని గుర్తించామని కతిరేశన్ వెల్లడించారు.
ఈ విధానం విజయవంతం కావడంతో నేపాల్‌లో అమలుకు ఒక సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు.రైతుల ఆదాయం పెంచే వివిధ విధానాలపై పరిశోధనలు నిర్వహించామన్నారు. ప్రపంచ బ్యాంక్, మిలిందా గేట్స్ ఫౌండేషన్, తదితర సంస్థలు నిధులు సమకూర్చాయన్నారు. ఒక ఎకరాలో 20 షెడ్లను నిర్మించాలని, సంవత్సరానికి దాదాపు 17 టన్నుల మేర కోళ్ల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయన్నారు. ఆదాయం గణనీయంగా పెరగడంతో అనేక మంది ఇతర రాష్ట్రాల రైతులు ఈ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నారని కతిరేశన్ వివరించారు.
Tags:Nepal farming in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *