నేరారంధ్రప్రదేశ్….

Date:08/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
రాష్ట్రాన్ని నేర రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నేరాలు ప్రతి ఏడాదీ పెరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి అక్టోబర్‌ ఎనిమిదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,40,069 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అదే తేదీ నాటికి 1,47,785 కేసులు నమోదయ్యాయి. అంటే తొమ్మిది నెలల్లో 7716  కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కిడ్నాప్‌, చీటింగ్‌, శిక్షించదగిన హత్యానేరాల్లో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది 855 కిడ్నాప్‌ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 884కి పెరిగాయి.
గత సంవత్సరం 4165 చీటింగ్‌ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 4565 కేసులు నమోదయ్యాయి. గతేడాది శిక్షించదగిన హత్యానేరం కేసులు 232 నమోదు కాగా వాటి సంఖ్య 270కి పెరిగింది. ఇతర నేరాల కేసులు 84,033 నుంచి 97,422కి పెరిగాయి. ఒక ఏడాదిలోనే 13,389 ఇతర నేరాల కేసులు, 400 చీటింగ్‌ కేసులు పెరగడం గమనార్హం. సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే 132 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. నమోదయిన కేసుల్లో 1,28,122 కేసులు (86 శాతం) ఇంకా విచారణ స్థాయిలోనే ఉన్నాయి. కేవలం 2700 కేసులు విచారణ పూర్తయ్యాయి. 10258 కేసులకు కోర్టు విచారణ పూర్తి చేసింది.
గతేడాదితో పోలిస్తే 11 పోలీస్‌ జిల్లాల్లో కేసులు పెరిగాయి. కడపలో గతేడాది 15045 కేసులు నమోదుకాగా ఈ ఏడాది అత్యధికంగా 19492కి పెరిగి నేరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. నెల్లూరు జిల్లాలో 9925 నుంచి 12831కి, గుంటూరులో 9523 నుంచి 11257కి, తూర్పు గోదావరిలో 11078కి కేసుల సంఖ్య పెరిగింది. అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చిచంపడం, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వినాయక నిమర్జనంలో ప్రభోదానంద భక్తులు గ్రామస్థులపై దాడి చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలోని శాంతి భద్రతల లోపాన్ని ఎత్తిచూపు తున్నాయి. శాంతిభద్రతలు లోపించాయని అధికార పార్టీకి చెందిన ఎంపి జెసి దివాకర్‌రెడ్డి స్వయంగా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలకు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు సమావేశాలు, సమీక్షలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags:Nerarandhraprades ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed