కమలంలో కొత్త పంచాయితీ

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణ బీజేపీలో ఇదో కొత్త పంచాయితీ. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్న నేతల మధ్య అస్సలు పడటం లేదట. ఒక నేత తీరుపై గుర్రుగా ఉన్న కొందరు.. ప్రత్యేకంగా సమావేశం పెట్టుకునే వరకు సమస్య తీవ్రత చేరుకుంది. సీనియర్లుగా ఉన్నా ప్రాధాన్యం దక్కడం లేదని రుస రుసలాడుతున్నాట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా?గడిచిన ఏడాదిన్నర కాలంగా తెలంగాణ బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు చాలామందే ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్‌ నాయకులు ఎక్కువే. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ మంత్రులు ఏ చంద్రశేఖర్‌, విజయరామారావు, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్‌, వివేక్‌, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌ ఇలా జాబితా పెద్దదే. ఆ తర్వాత రాజకీయ కారణాలతో బీజేపీ గూటికి వచ్చిన వారిలో ఈటల రాజేందర్‌,

 

 

 

ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమ మూలాలు ఉన్న ఓ పార్టీ కూడా ఇటీవలే బీజేపీలో విలీనమైంది. ఇలా వచ్చినవారికి వాళ్లల్లో వారికే పడటం లేదట.ఇలా టీఆర్ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకులు ఒకేతాటిపైన లేరనే టాక్‌ ఉంది. వారిలో చాలా మంది ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం. బీజేపీలో ఈటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నారాజ్‌గా ఉన్నారట కొందరు మాజీ మంత్రులు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడే కాదు.. బీజేపీలో కూడా తాము సీనియర్స్‌ అనే విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నారట. ఈ కోణంలో పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంపై ప్రశ్నలు సంధిస్తున్నారట ఆ నాయకులు.ప్రస్తుతం బీజేపీలో ఈటల టీమ్‌తో.. వలస నేతల్లో కొందరు అంటీముట్టనట్టు ఉంటున్నారట. అంతర్గతంగా వీళ్లు పెట్టే మీటింగ్‌కు వాళ్లు.. వాళ్ల సమావేశాలకు వీళ్లు వెళ్లడం లేదట. ఎవరి ప్రెస్‌మీట్స్‌ కూడా వారివే. టీఆర్ఎస్‌ లేదా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయాలన్నా వేర్వేరుగానే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వలస నేతలు ప్రత్యేకంగా సమావేశమై..

 

 

ఈటల అండ్‌ కో అంశంపై చర్చించారట. చేరికల కమిటీ మీటింగ్‌ జరిగినా ఒక మాజీ మంత్రి రాకపోవడంతో చర్చ సాగింది. అలాగే ఈ మధ్య కాలంలో ఓ సభకు టీఆర్‌ఎస్‌ మాజీలు అంతా హాజరైనా ఈటల మాత్రం కనిపించలేదు. అది కూడా కాషాయ పార్టీలో చర్చకు కారణమైంది. అసలు ఆ సమావేశానికి ఈటలను పిలిచారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కే కొద్దీ.. తెలంగాణ బీజేపీలో ఇలాంటి గొడవలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి అసంతృప్త నేతలు ఓపెన్‌ కాకపోయినా.. రేపటి రోజున ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వలస నేతల్లో కొందరు జాతీయ నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లడం.. మరికొందరు తమ సీటుకు ఎసరు రాకుండా.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేలా ఫోకస్‌ పెట్టారు. కానీ.. కొందరు మాత్రం పార్టీలో ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నారట. అక్కడే సమస్యలు వస్తున్నాయన్నది కొందరి అభిప్రాయం. మొత్తానికి బీజేపీలో టీఆర్ఎస్‌ మాజీల లొల్లి బాగానే నడుస్తుందని తెలుస్తోంది. వీటిని పార్టీ పెద్దలు గమనిస్తున్నారట. సమయం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటారని అనుకుంటున్నారట. మరి.. ఈ రగడ టీ కప్‌లో తుఫాన్‌గా సద్దుమణుగుతుందా లేక బరస్ట్‌ అవుతుందో చూడాలి.

 

Tags: New Panchayat in Kamal

Leave A Reply

Your email address will not be published.