పల్లెల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

Date:12/02/2019
ఖమ్మం ముచ్చట్లు:
పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామంలో ఏదైనా సమస్య తలెత్తితే ప్రజాప్రతినిధికి చెప్పేందుకు సర్పంచి ఉన్నారు. మరి అధికారికంగా ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే.. గ్రామ కార్యదర్శి కావాలి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల కొరత పట్టిపీడిస్తోంది. ఊరికి ఆయనే పరిపాలన అధికారి.. సాధక బాధకాలు చెబుదామంటే గ్రామానికి వచ్చేది అంతంత మాత్రమే. ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఖమ్మం జిల్లాలో 485, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 391 ఖాళీలు ఉండటం గమనార్హం.
ఉభయ జిల్లాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ఒక్కో కార్యదర్శి నాలుగు, ఐదు గ్రామాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. జిల్లా పంచాయతీ అధికారులు కూడా ఉన్న కార్యదర్శులను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యదర్శులకు సంబంధించిన నియామకం చేపట్టినప్పటికీ వివిధ కారణాలతో నియామక ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ఉభయ జిల్లాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఉన్న కార్యదర్శులపై పని భారం పెరుగుతోంది. ఒక గ్రామానికి వెళ్లి మరో గ్రామానికి మధ్య దూరం ఎక్కువగా ఉండటం, ఎక్కడికక్కడ సమస్యలు నెలకొనడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మధ్య రోజుల వ్యవధిలో తేడా ఉండటంతో తమ గ్రామాలకు కార్యదర్శులు రావడం లేదన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తోంది. నాలుగైదు గ్రామాలు ఉండటంతో ఏ గ్రామంపైన పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఆ ప్రభావం గ్రామ పంచాయతీ పనితీరుపై పడుతోంది. గ్రామ పంచాయతీ పాలక మండలికి పేరు తెచ్చే అంశాలు మూడే. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు. ఈ మూడు వ్యవస్థలు సర్పంచి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. తాగునీరు సకాలంలో రాకుంటే కనీసం మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని జనం అంటారు. రెండో అంశం పారిశుద్ధం. డ్రైనేజీల్లో పూడికతీత, మురుగు తొలగించడం, వీధులను శుభ్రం చేయించాలి. ఎక్కడి చెత్త అక్కడే ఉంటే వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. మూడోది వీధిదీపాలు. రాత్రిళ్లు చిమ్మ చీకటిగా వీధులుంటే జనం భయాందోళనలకు గురవ్వడం సహజం. ప్రతి సర్పంచి, పాలక మండలి తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలపై ప్రధానంగా దృష్టిపెడితే గ్రామంలో సగం సమస్యలు తీరినట్లే.  వీటన్నింటిని పరిపాలన పరంగా పర్యవేక్షణ చేసే పంచాయతీ కార్యదర్శులుంటేనే ఆయా అంశాలపై దృష్టిపెట్టే వీలుంటుంది. లేకుంటే జనానికి ఇబ్బందులు.. గ్రామ పంచాయతీ పాలకమండలికి విమర్శలు తప్పవు.
Tags:New ruling circles in the villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *