పళని స్వామికి కొత్త టెన్షన్

New tension for Palani Swamy

New tension for Palani Swamy

Date:20/09/2018
చెన్నై ముచ్చట్లు:
 అన్నాడీఎంకేలో ఇదే టెన్షన్….టెన్షన్. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి భవిష్యత్  తేలనుంది. ముఖ్యమంత్రి పళని స్వామికి పాలన ఇప్పుడు దినదినగండంగా మారింది. అసలే అన్నాడీఎంకేలో అసంతృప్తులు పెరిగిపోయి దినకరన్ గూటికి చేరేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై తీర్పు వచ్చిన తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని దినకరన్ ధీమాగా చెబుతున్నారు.
అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు స్పీకర్ ధన్ పాల్ తో పళని స్వామి సుదీర్ఘమంతనాలు చేస్తున్నారు. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఏంచేయాలన్నదానిపై ఆయన స్పీకర్ దన్ పాల్ తో చర్చించినట్లు తెలిసింది. అలాగే న్యాయనిపుణులతో కూడా పళనిస్వామి చర్చిస్తున్నారు.అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలపై తీర్పు రేపు వెల్లడయ్యే అవకాశముంది. తీర్పు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే వెంటనే ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
అదే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంటుంది. ఇప్పటికే డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే సభ్యుడు ఎకే బోస్ అకాల మరణంతో తిరువారూర్, తిరుప్పకుండ్రం ఉప ఎన్నికలు జరగనున్నాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఆరునెలల్లో ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వీరంతా దినకరన్ వర్గంగా భావించిన పార్టీ విప్ స్పీకర్ ధన్ పాల్ కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది సెప్టంబరు 18వ తేదీన స్పీకర్ ధన్ పాల్ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
దీనిపై 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇందిరా బెనర్జీ, జస్టిస్ సుందర్ లు ఈ కేసు విచారణ చేసిన తర్వాత తుదితీర్పులో భిన్నమైన తీర్పులు ఇచ్చారు. దీంతో మూడో న్యాయమూర్తికి ఈ కేసు విచారణను అప్పగించింది. ఈ కేసును విచారించిన సత్యనారాయణన్ రేపు తీర్పు వెల్లడించే అవకాశముంది.
ఈ తీర్పే తుది తీర్పు కావడంతో ఏ తీర్పు వచ్చినా పళనిస్వామికి కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తీర్పు పట్ల దినకరన్ వర్గం ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే వెంటనే పళనిస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని దినకరన్ ఇప్పటికే హెచ్చరించారు. తీర్పు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే మాత్రం పళని ప్రభుత్వం రోజుల్లోనే కూలడం ఖాయం.
దినకరన్, డీఎంకే లు కలసి పళనిని కుర్చీ దింపే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తే మాత్రం పళనిస్వామికి ఆరు నెలల రిలీఫ్ ఉంటుంది. ఆరునెలల్లోపు ఆ 18 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఎన్నికల్లోఅన్ని చోట్ల గెలిస్తేనే పళని ప్రభుత్వం నాలుగు కాలాలపాటు మనగలదు. లేకుంటే కూలిపోవడం తథ్యం. అందుకే డీఎంకే, దినకరన్ పార్టీలు ఉత్సుకతతో తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి.
Tags: New tension for Palani Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *