గ్రామాల్లో చెత్త సమస్య 

Date:22/03/2018
గుంటూరు ముచ్చట్లు:
పరిశుభ్రమైన పల్లెలు సాకారం కావటానికి, కనుల విందు చేయటానికి ఉన్న ప్రధాన అడ్డంకి పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం. వీధుల మలుపుల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్తను అతి కష్టం మీద తరలించి ఆయా గ్రామాల శివారుల్లో పోయటం కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న పరిస్థితి. అయితే పల్లెలు స్వచ్ఛ మల్లెలు కావాలన్న లక్ష్యంలో భాగంగా ఈ పరిస్థితిని మార్చాలని పంచాయతీరాజ్‌ శాఖ భావించి ప్రతి గ్రామంలోనూ ఇంటింటి చెత్త సేకరణ, చెత్త నిర్వహణకు కంపోస్టుయార్డు నిర్మించాలని కార్యాచరణ ప్రకటించింది. ఇది అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా తక్కువ గ్రామాల్లో మాత్రమే ప్రగతి ఉంది.స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, నిర్వహణలపై భారీ కసరత్తు, ప్రణాళికతో పరిస్థితులను చాలా వరకు గాడిన పెట్టిన తర్వాత ప్రభుత్వం పల్లెల వైపు దృష్టి సారించింది. పల్లెల్లో పరిశుభ్రత పరంగా పరిస్థితులు మెరుగుపడితే చాలా వరకు నగరాలు, పట్టణాలకు వలసలు నివారించటంతో పాటు గ్రామాభివృద్ధి కల సాకారం అవుతుందని పాలకులు, అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇకపై ఏ గ్రామంలోనూ ఏ ఇంటి వారు చెత్తను రోడ్లు, కాలువలలో వేయకుండా నేరుగా ఇంటి వద్ద నుంచే సేకరించాలని, వాటిని తీసుకెళ్లి గతంలో మాదిరిగా గ్రామ శివారులో పడేయకుండా గ్రామంలోనే కంపోస్టుయార్డును నిర్మించాన్నది ప్రణాళికలో భాగం. అదే విధంగా తడి చెత్త ద్వారా ఎరువు, పొడి చెత్తను రీ-సైక్లింగ్‌కు తరలించటం ఈ రెండు పనుల ద్వారా ఆయా పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చటం మొత్తం మీద సాధించదలిచిన ఫలితం.  ఈ పనులన్నీ చేయాలంటే ప్రతి పంచాయతీలోనూ సిబ్బంది ఉండాలి కాబట్టి, స్థానిక సంస్థలు వారి వేతనాలను చెల్లించటం సందేహాస్పదం అయినందున గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద వారి నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒకరిని నియమించుకునే వెసులుబాటు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన ఇతర పనుల మాదిరి బిల్లుల చెల్లింపు ఆలస్యం కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలను ‘గ్రీన్‌ ఛానల్‌’ ద్వారా సత్వరం చెల్లించేలా ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ యావత్తు కార్యక్రమాల పునాది 2015వ సంవత్సరంలోనే పడింది.గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్డు నిర్మాణం, పిట్ల ఏర్పాటుకు 2015వ సంవత్సరంలోనే సర్వే నిర్వహించి కార్యాచరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ఎక్కడా పూర్తి స్థాయిలో లక్ష్యం సాకారం కాలేదు. ఏ ఒక్క గ్రామం కూడా సంపూర్ణంగా చెత్త రహితం కాలేదు. నిబంధనల మేరకు కంపోస్టుయార్డు షెడ్ల నిర్మాణం పూర్తయిన గ్రామాల్లోనే పారిశుద్ధ్య సిబ్బందిని ఉపాధి హామీ పధకం కింద నియమించుకునే అవకాశం ఉంది. దీనితో షెడ్ల నిర్మాణమే పూర్తి కాలేదు కాబట్టి సిబ్బంది నియామక ప్రశ్నే తలెత్తలేదు. ఫలితం ఎక్కడి గొంగళి అక్కడే. మొత్తం మీద గణాంకాలను పరిశీలిస్తే సాధించింది గోరంత, ఇంకా చేయాల్సింది కొండంత ఉందన్న సంగతి విదితం అవుతుంది. పడుతూ లేస్తూ సాగిన నిర్మాణాలలో పూర్తి అయినవి వేళ్ల మీద లెక్కపెట్టగలిగినవి మాత్రమే. రెండు జిల్లాల్లో కలిపి ఘన వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ ప్రాథమిక దశలో మొదలు పెట్టిన గ్రామాలు కేవలం 42 మాత్రమే.
మంజూరై నిర్మాణాలు మొదలు కాని వాటికి సంబంధించి ప్రధాన కారణం తగిన స్థలాలు లేక పోవటం. ఈ రెండు జిల్లాల్లో పంచాయతీ సిబ్బంది సర్వే చేసి కంపోస్టుయార్డు నిర్మాణానికి తగిన స్థలాలు తమ పరిధిలో లేవని స్థలం చూసి పెట్టాలని ఆయా మండలాల తహశీల్దార్లకు లేఖలు పెట్టారు. ప్రారంభం కాని వాటిల్లో దాదాపు 90 శాతం అంటే 490 గ్రామాలకు పైగా ఈ పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. పల్లెల్లో వ్యర్థాల నిర్వహణ అంశం ఈరెండు జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో కేవలం అధికారుల పరిధిలోనే ముందుకు సాగింది. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టినవి చాలా తక్కువ. వారే తమ తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు స్వచ్ఛతకు ప్రతి రూపాలుగా ఉండాలని పోటీ తత్వంతో ముందుకు సాగి ఉంటే స్థలాల సమస్య అనేదే ఉత్పన్నం అయ్యేది కాదు. గ్రామాల ప్రగతికి స్టార్‌ రేటింగ్‌లు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతి చోట కూడా పారిశుద్ధ్య నిర్వహణ అనేది చాలా కీలక అంశంగా మారింది. చెత్త నిర్వహణ సరిగ్గా లేక ఎక్కడ బడితే అక్కడ వ్యర్థాల గుట్టలు, దోమలు ఉంటే ఇతరత్రా ఎలాంటి ప్రగతి సాధించినా అదంతా పూర్తి ఫలితమివ్వదన్న విషయం అటు పాలకులు, ఇటు అధికారులు తెలుసుకోవాల్సి ఉంది. అందరూ సమష్టిగా సరైన ప్రణాళికతో ముందుకు సాగితేనే చేపట్టిన భారీ కార్యక్రమం ఫలవంతమవుతుంది. పక్కా ప్రణాళిక, సమన్వయం లేకుంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా పల్లెల పారిశుద్ధ్య పరిస్థితిలో మార్పు రాదు.
Tags: New to Dvakra…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *