దిల్ సుఖ్ నగర్ కేసులో కొత్త ట్విస్ట్

Date:10/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మనస్విని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కత్తి దాడిలో మెడ భాగంలో లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైందని.. శస్త్ర చికిత్స నిర్వహించి తెగిపోయిన నరాలను అతికించినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజులు గడిస్తే గానీ బాధితురాలి పరిస్థితి చెప్పలేమన్నారు. మరోవైపు యువతిపై దాడి చేసిన అనంతరం భయభ్రాంతులకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌ (22)కు, బడంగ్‌పేటకు చెందిన మనస్విని(22)తో హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది. చైతన్యపురిలోని ఓ బ్యాంక్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న వీరి మధ్య స్నేహం చిగురించింది. అయితే.. కొంత కాలంగా వెంకటేశ్‌ తనను ప్రేమించాలని మనస్వినిపై ఒత్తిడి తెస్తుండగా.. మనస్విని నిరాకరిస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్ ప్రవర్తన నచ్చని మనస్విని కొంతకాలంగా అతడిని దూరంగా ఉంచింది.

 

 

 

దీంతో మనస్వినిపై అతడు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ సోమవారం రాత్రి చైతన్యపురిలోని బృందావన్‌ లాడ్జిలో ఓ గదిని ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకున్నాడు. మంగళవారం ఉదయం మనస్విని (22)కి ఫోన్‌ చేసిన వెంకటేశ్.. మాట్లాడాల్సి ఉందని, కలవాలని కోరాడు. ఉదయం 10 గంటల సమయంలో వారిద్దరూ కలిసి లాడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత 501 నంబర్ గదే కావాలని లాడ్జి సిబ్బందితో వెంకటేశ్ కాసేపు వాదించాడు. చివరికి అదే గదిని అద్దెకు తీసుకున్నాడు. తన స్నేహితురాలితో కలిసి వచ్చినట్టు లాడ్జి రికార్డులో పేర్కొన్నాడు.

 

 

అనంతరం మనస్విని ఆ గదికి తీసుకువెళ్లాడు. గదిలోకి వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ గది నుంచి కేకలు వినబడటంతో ఫ్లోర్‌బాయ్‌ అప్రమత్తమై 501 గది డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో లాడ్జి సిబ్బంది తలుపులు విరగ్గొట్టారు. లోపలి లోపలికి వెళ్లి చూడగా.. మనస్విని రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమెను వెంటనే ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు.

 

 

 

 

వెంకటేశ్‌తో ముప్పు ఉందని గ్రహించిన మనస్విని తన తండ్రికి లొకేషన్ షేర్ చేసింది. తల్లిదండ్రులు చేరుకునే సరికే వెంకటేశ్ కత్తితో ఆమె గొంతు కోశాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భయాందోళనకు గురై బాత్రూంలోకి వెళ్లి అదే కత్తితో చేయి కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్ ప్రేమను నిరాకరించిన మనస్విని అతడితో ముప్పు ఉందని తెలిసి కూడా.. పిలవగానే లాడ్జికి ఎందుకు వెళ్లిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

 

 

మరోవైపు తమ కుమారుడు దారుణానికి పాల్పడ్డాడనే సమాచారం తెలిసి స్వగ్రామంలో వెంకటేశ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంకటేశ్ తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడతున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బృందావన్‌ లాడ్జిని పరిశీలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ ఏ సమయంలో లాడ్జిలోకి వచ్చారు? ఏ పేరుపై వారికి ప్రవేశానికి అనుమతించారు? తదితర అంశాలను ఆరా తీశారు. హోటల్‌లోని సీసీ కెమెరా దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లాడ్జి సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

కట్టుకుంటున్న దొరసాని ట్రైలర్

 

Tags: New twist in Dil Sukhnagar case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *