Natyam ad

పవన్, లోకేష్ యాత్రలతో కొత్త సంవత్సరం

మరి జగన్ వ్యూహం ఏమిటీ

 

విజయవాడ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త ఏడాదిలో కొత్త రూపం తీసుకోనున్నాయి. సాధారణంగా ఎన్నికల ఏడాది అంటే ఉండే హడావుడి వేరు. ఈ సారి ఏపీలో అంతకు మించి పోరాటం జరగనుంది.  తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యత మొత్తం నారా లోకేష్ తీసుకుంటున్నారు. పాదయాత్ర చేయబోతున్నారు.  జనవరి నుంచి ప్రారంభించి ఎన్నికల వరకూ పాదయాత్ర ఉంటుంది. ఇక జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బస్సుయాత్ర చేయబోతున్నారు.  అన్ని నియోజకవర్గాల్లో సాగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వీరికి వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు ?  తాను కూడా పోటీగా ప్రజల్లోకి వెళ్తారా ? ఎవరూ ఊహించని షాకిస్తారా ? తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.  సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరే ఉండటంతో ఇప్పటినుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు   2023, జనవరి 27 నుంచి రాష్ట్రమంతటా పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు.  400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది.  గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ‘వస్తున్నా … మీ కోసం’ అంటూ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేష్ కూడా 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

 

 

 

Post Midle

2023, జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏడాదికి పైగా యాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నారు. పార్టీ నేతలతో పాటు యువత ఎక్కువగా పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు.  ప్రధానంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడమే కాకుండా ఎన్నికలకు కూడా సిద్ధమయ్యేలా లోకేష్ పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలోనే  యాత్ర చేయాలని నిర్ణయించారు. పాదయాత్ర అయితే  అనేక సమస్యలు వస్తాయని .. బస్సు యాత్రకు మొగ్గు చూపారు.  విజయదశమి నుంచే బస్సు యాత్ర ప్రారంభమవ్వాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలవ్ల జనవరి నుంచి యాత్ర ప్రారంభించేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.  తిరుపతి నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో గత ఎన్నికల్లో జనసేన దగ్గర వరకు వచ్చి ఓడిపోయిన నియోజకవర్గాలను

 

 

 

 

ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాత్ర చేయాల్సిన బస్సును కూడా పవన్ ప్రత్యేకంగా సిద్దం చేయించుకుంటున్నారు. దాదాపుగా ఈ బస్సు కూడా రెడీ అయిపోయింది. ఎన్టీఆర్ వాడిన చైతన్యరథం తరహాలో ఈ  బస్సును సిద్ధం చేశారు. విపక్ష నేతలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రభుత్వాధినేత జగన్ వ్యూహం ఏమిటన్నది మాత్రం స్పష్టత లేదు. ప్రతి పథకానికి బటన్ నొక్కడానికి ఆయన జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. పార్టీ నేతలందర్నీ గడప గడపకూ పంపుతున్నారు. వచ్చే జనవరికి ఈ ప్రోగ్రాం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత జగన్ తాను స్వయంగా ఏమైనా ప్రచార రంగంలోకి దిగుతారా.. నేరుగా ప్రజల్ని కలిసే కార్యక్రమాలు ఏమైనా చేపడతారా అన్న చర్చ వైసీపీలో నడుస్తోంది. కరోనా కారణం కావొచ్చు.. ఇతర కారణాలు కావొచ్చు.. జగన్ పదవి చేపట్టినప్పటి నుండి ప్రత్యక్షంగా ప్రజల్ని కలవలేదు. ఇప్పుడు సీఎంగా ఆయన ప్రజల్ని కలిస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుందని భావిస్తున్నారు.

 

 

 

 

అయితే ఏ ప్రణాళికలు లేకుండా ఉండవని.. జగన్ దగ్గర అటు లోకేష్‌కు.. ఇటు పవన్‌కు మైండ్ బ్లాంక్ చేసే ప్లాన్స్ ఉంటాయని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటి వరకూ జరుగుతున్న  రాజకీయ పరిణామాలను చూస్తే.. ఏపీలో ప్రభుత్వం ముందస్తు ప్రయత్నాలు చేస్తోందన్న అభిప్రాయం ఖచ్చితంగా ఏర్పడుతుంది. జనవరి కల్లా ప్రజలకు చెప్పాల్సింది చెప్పేస్తారు.  జగన్ జిల్లాల పర్యటనలూ పూర్తి చేస్తారు. ఇప్పటికే హామీలన్నీ పూర్తి చేసేసేశామని చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు.. సంక్షేమం ఎజెండాగా ముందస్తుకు వెళ్లి మరోసారి ఆదరిస్తే.. మరింత మంచి పాలన అందిస్తామని ప్రజల్ని అడిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ అధినేత చేస్తున్న కసరత్తు ఆ దిశగానే ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  బహుశా.. యువనేతలిద్దరి టూర్లు.. ప్రారంభించగానే.. ముగించేయడానికి జగన్ ముందస్తు ప్రకటనతో ప్లాన్ చేస్తారేమో చూడాలి !

 

Tags: New year with Pawan and Lokesh Yatra

Post Midle