ఈసారైనా..! (నల్గొండ)

.. next time! (Nalgonda)

.. next time! (Nalgonda)

Date:06/10/2018
నల్గొండ ముచ్చట్లు:
పండించిన పంటకు మద్దతు ధర పొందడానికి అన్నదాత నానా అగచాట్లు పడుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో దళారీ వ్యవస్థ.. మార్కెట్‌ యార్డుల్లో కమీషన్‌దారుల దోపిడీకి తోడు కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పరీక్షించేందుకు సరిపడా యంత్రాలు, సిబ్బంది లేకపోవడం సమస్యలు మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు.
ఈ ఏడాది కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచడంతో అన్నదాతలు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు చూస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణానికి మించి వరి సాగు చేపట్టారు. మరో 15 రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి.  దీంతో మార్కెటింగ్ శాక కొనుగోలు కేంద్రల ఏర్పాటుపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండలో 60, సూర్యాపేటలో 24, యాదాద్రి భువనగిరి జిల్లాలో 124 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మూడు జిల్లాల జేసీలు ప్రాథమికంగా నిర్ణయించారు. రబీలో విభాజ్య నల్గొండ జిల్లాలోనే 214 కేంద్రాల ద్వారా 4.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు కావడంతో కేంద్రాలను తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు.
ధాన్యం సేకరణకు 98.60 లక్షల గోనె సంచులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. వీటిలో 70 శాతం కొత్తవి సిద్ధం చేశారు. మిగిలినవి మిల్లర్ల నుంచి పౌరసరఫరాల శాఖకు రావాల్సి ఉంది. ధాన్యం రవాణా కోసం మూడు జిల్లాల్లో గుత్తేదారులను ఖరారు చేసి వివరాలు ఉన్నతాధికారులకు పంపించారు.  ప్రతి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు  చేస్తున్నా, రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ రాష్ట్రంలోనే పెద్దది. రోజుకు లక్ష బస్తాల ధాన్యం వచ్చినా ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేస్తామని అధికారులు ప్రకటించిన సందర్భాలున్నాయి.
గతేడాది రబీలో ఒక రోజులో 90వేల బస్తాల ధాన్యం మార్కెట్‌కు వస్తే కమీషన్‌దారులు ధర తగ్గించేశారు. అదే రోజు భారీ వర్షం రావడంతో 50 వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసింది. దాన్ని మద్దతు ధరకు కొనేందుకు అధికారులు విముఖత చూపడంతో రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. సమస్య మార్కెటింగ్‌ శాఖ మంత్రి దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, జేసీ మూడు రోజులపాటు ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు.
ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిజిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉండవు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో 3 లక్షల బస్తాల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్లలో తరుగు పేరిట దోపిడీ మామూలైపోయింది.
కాంటాలు పూర్తయినా ధాన్యం రవాణాకు నోచుకోక బస్తాలు తడిసిన సంఘటనలున్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార, రవాణా, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాధారణ సాగు 1.40 లక్షల హెక్టార్లు ఉండగా ప్రస్తుతం 1.50 లక్షల హెక్టార్లకు చేరింది. సాగర్‌ జలాశయం పూర్తిగా నిండటంతో సెప్టెంబర్‌లో సైతం నాట్లు వేస్తున్నారు. మూడు జిల్లాల్లో సూర్యాపేటలోనే అధికంగా 70వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు.
హెక్టారుకు 5.6 మెట్రిక్‌ టన్నుల అంచనాల ప్రకారం 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఖరీఫ్‌లో సాగర్‌ ఆయకట్టు ప్రాంతాలైన సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సన్నరకాలు సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీటి సాగు తక్కువగా ఉంది. ఏటా ఖరీఫ్‌ సీజన్లో 30 నుంచి 50 శాతం ధాన్యం మాత్రమే ప్రభుత్వ కేంద్రాలకు వస్తుంది.
ప్రభుత్వం ఈ ఏడాది ఏగ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.1,770, సాధారణ రకం రూ.1,750గా ధర నిర్ణయించింది. దీంతో మరో పది శాతం అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అందుకనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో హమాలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. రెండు సీజన్లలో కొనుగోళ్ల తీరు పరిశీలిస్తే ప్రధానంగా హమాలీల కొరత వేధించింది. కేంద్రాల ఆరంభంలో సంఘాలు, పీఏసీఎస్‌ నిర్ణయించిన ధరకు పనిచేస్తామని చెప్పి.. ధాన్యం కల్లాలకు చేరిన తర్వాత కూలీ పెంచాలని ధర్నాకు దిగుతున్నారు.
ధర్నాతో కొనుగోళ్లు నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్వాహకుల ప్రణాళిక లోపం కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని అధికారులు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన టార్పాలిన్లు, మంచినీళ్లు, నీడ సౌకర్యాలను గ్రామీణాభివృద్ధి శాఖ కల్పించాల్సి ఉన్నా ఎక్కడ చేపట్టడం లేదు.
Tags:.. next time! (Nalgonda)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *