ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్యోగ విరమణ

NGO's Association President Ashok Babu retired from job

NGO's Association President Ashok Babu retired from job

Date:11/01/2019
విజయవాడ ముచ్చట్లు:
ఆంధప్రదేశ్ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. అశోక్‌ బాబు పెట్టుకున్న వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఆయన చాలా రోజుల క్రితమే తన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అశోక్‌బాబు దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం.. ఆయన అభ్యర్థనకు ఓకే చెప్పింది. గురువారం ఆయనకు తోటి ఉద్యోగులు వీడ్కోలు కూడా పలికారు. వీఆర్ఎస్ తీసుకున్న అశోక్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఉద్యోగానికి గుడ్ బై చెప్పారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అశోక్ బాబు వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఓ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నుంచే తెలుగు దేశం గూటికి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు కూడా అదే చర్చ మొదలయ్యింది.
అశోక్‌బాబు రాజకీయ భవిష్యత్‌పై అప్పుడే ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో మరో కొత్త ప్రచారం మొదలయ్యింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి టీడీపీ తరపున అశోక్ బాబును బరిలోకి దింపబోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ వ్యూహాంలాగే ఉద్యోగ సంఘాల నేతలకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. అదే జరిగితే అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కడ ఖాయమని టాక్.అశోక్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణపై వివాదం నడిచింది. ఏప్రిల్‌లో పదవి విరమణ చేయాల్సి ఉంటే.. ముందుగా వీఆర్‌ఎస్‌కు ఎందుకు వెళ్లారనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై సమాధానం చెప్పాలని వాణిజ్య పన్ను శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
అశోక్‌బాబు నకిలీ సర్టిఫికెట్‌ వ్యవహారం నుంచి బయటపడేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ప్రభుత్వం వీఆర్ఎస్‌కు ఓకే చెప్పడంతో వివాదం సద్ధుమణిగింది. అశోక్‌బాబు వీఆర్ఎస్ తీసుకోవడంతో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్ష, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ పదవులు ఎవరికనే చర్చ మొదలయ్యింది. అయితే ప్రస్తుతం ఎన్జీవోల ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఈ రెండు బాధ్యతలూ చేపట్టబోతున్నట్లు అమరావతి టాక్. శని, ఆదివారాల్లో ఎన్జీవోల సంఘం కార్యనిర్వాహక సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట.
Tags:NGO’s Association President Ashok Babu retired from job

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *