పోలవరంపై ఎన్జీటీ కమిటీ

Date:22/02/2020

ఏలూరు ముచ్చట్లు:

ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావానికి సంబంధించిన అంశంపై అధ్యయనం చేసేందుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌  ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు వెల్లడించింది.. కమిటీలో పిపిఎ ఉన్నతాధికారులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉంటారని స్పష్టం చేసింది. ఈ విషయంలో సహకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది.

 

 

 

పోలవరం డ్యాం ఎత్తు పెంపుతో భద్రాచలం ఆలయం, టౌన్‌ ప్రాంతం ముంపునకు గురవుతాయని బిజెపి నేత పొంగులేటి సుధాకర్‌ వేసిన పిటిషన్‌పై గురువారం ఎన్‌జిటిలో విచారణ జరిగింది. కాగా, బచావత్‌ ట్రిబ్యూనల్‌ నిబంధనలకు భిన్నంగా పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని పిటిషన్‌దారుడి తరుపున న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేసు విచారణ అనంతరం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఎన్‌జిటి స్పష్టం చేసింది.

 

 

 

తెలంగాణలో ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని సూచించింది. కమిటీ నివేదిక అందించిన తరువాత తదుపరి విచారణ చేపడతామని ఎన్‌జిటి పేర్కొంది. కేసు విచారణ ఎప్పుడన్నది తరువాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది.పోలవరం డంప్‌పై పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ ఎన్‌జిటి విచారించింది. నిపుణుల కమిటీ సూచనలు అమలు చేసేందుకు సమయం కావాలని ఎపి ప్రభుత్వ తరపు న్యాయవాది వెంకట రమణి కోరారు. డంప్‌ వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాల్సి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. డంప్‌ వల్ల భూప్రకంపనలు రాకుండా 30 మీటర్ల లోతులో రాతి పునాది వెయ్యాలని ఐఐటి ఢిల్లీ నిపుణుల సూచనలను ఎపి ప్రభుత్వం అమలు చేయలేదని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది.

 

 

 

డంప్‌కు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం రాలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రజల భద్రత విషయంతో అధికారులు రాజీ పడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణను జస్టిస్‌ ఎకె గోయల్‌ ట్రిబ్యునల్‌ ఏప్రిల్‌ 1 నాటికి వాయిదా వేసింది.పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖ, నిపుణులతో కూడిన కమిటీని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) నియమించింది. రాష్ట్రంలోని పురుషోత్త పట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు లేవని దాఖలైన పిటిషన్లపై ఎన్‌జిటి గురువారం విచారించింది. జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ వాంగ్డీ, డాక్టర్‌ నగీన్‌ నందా, డాక్టర్‌ దాస్‌లతో కూడిన నలుగురు సభ్యుల ట్రిబ్యునల్‌ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

 

 

ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమో లేదో స్పష్టత లేదని, పరస్పర విరుద్ధ వాదన వినిపించిన కేంద్ర పర్యావరణ శాఖపై మండిపడింది. ఒకవైపు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ, మరోవైపు ఏపి ప్రభుత్వానికి షోకాజ్‌ నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. పోలవరం కాలువ వాడితే ఆ ప్రాజెక్టు ఇచ్చిన పర్యావరణ అనుమతులు సవరించాలని పర్యావరణ శాఖ సూచించింది. కాలువ వాడకపోతే అనుమతి అవసరం లేదని వాదించింది. పోలవరం మౌలిక సదుపాయాలు వినియోగించుకుంటే అనుమతులు అవసరమని తెలిపింది. తప్పులు జరిగితే చర్యలెందుకు తీసుకోలేదని ఎన్‌జిటి నిలదీసింది. పురుషోత్త పట్నం ఎత్తి పోతలకు అనుమతి అవసరం లేదని, పోలవరం పూర్తయ్యే వరకు మాత్రమే పురుషోత్త పట్నం, పట్టిసీమ ఎత్తిపోత ప్రాజెక్టులు ఉంటాయని ఎపి ప్రభుత్వ తరపు న్యాయవాది వెంకట రమణి వాదించారు.

 

 

 

కేవలం పోలవరం ఆయకట్టుకు, విశాఖ తాగునీటి అవసరాలకు, పరిశ్రమల వినియోగానికి వరద సమయంలో నీరు ఎత్తిపోస్తామని వివరించారు. పోలవరం పూర్తయ్యాక ఎత్తిపోతలు ఆపేస్తామన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ ఎలాంటి అధ్యయనం, అనుమతులు లేకుండా ఎత్తిపోతలు చేపట్టారని వివరించారు. పర్యావరణం, రైతులకు కలిగే నష్టాన్ని అంచనా వేయలేదన్నారు. ఎత్తిపోతల పథకాలు తాత్కాలికమైతే, పోలవరం పూర్తయ్యాక పంపులు తీసేట్లయితే రైతులకు ఎందుకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తున్నారని అన్నారు. రైతులపై దౌర్జన్యం చేసి, పోలీసు కేసులు పెట్టి భూములు తీసుకున్నారని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు.

 

 

 

 

ఏడాది పొడవునా పంటలు పండే భూములను తాత్కాలిక ప్రాజెక్టుకు తీసుకొని మూడేళ్లయినా పరిహారం ఇవ్వలేదన్నారు.మరోవైపు పురుషోత్త పట్నం, పట్టిసీమ, చింతలపూడి, గోదావరి పెన్నా ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. పురుషోత్త పట్నం, పట్టిసీమ ప్రాజెక్టులు పోలవరంలో భాగం కాదని కేంద్ర జలవనరుల శాఖ తేల్చి చెప్పింది. ఆ రెండు ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు కేంద్రం ఇవ్వదని స్పష్టం చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ, నిపుణులతో కూడిన కమిటిని ఎన్‌జిటి నియమించింది. రెండు వారాల్లో కమిటీ సమావేశం కావాలని ఆదేశించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమో..కాదో నెల రోజుల్లో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 4 నాటికి వాయిదా వేసింది.

గోగర్భం వద్ద క్షేత్రపాలకుడికి ఘనంగా అభిషేకం

Tags: NGT Committee on Polavaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *