నో కండిషన్స్ అప్లై 

Date:17/04/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
నగరంలో నిబంధనలు అటకెక్కాయి.. బఫర్‌ జోన్‌లోనే ప్రహరీ వచ్చింది.. సుమారు 2వేల గజాల భూమి కలిసొచ్చింది.. విల్లాల నిర్మాణం చకాచకా జరుగుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ విల్లాల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అధికారులు గుడ్డిగా అనుమతులివ్వడం ఒక ఎత్తైతే.. క్షేత్రస్థాయిలో ఒక్కసారి కూడా పరిశీలించకపోవడం మరో ఎత్తు. దీంతో నిర్మాణ సంస్థ వదిలిందే బఫర్‌జోన్‌.. ఖాళీగా ఉంచిన స్థలమే సెట్‌బ్యాక్‌ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఐటీ కారిడార్‌లోని సున్నం చెరువు బఫర్‌ జోన్‌లో జరుగుతోన్న భారీ రియల్‌ ప్రాజెక్టు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇరిగేషన్‌ నిబంధనల ప్రకారం 30మీటర్ల స్థలం వదలాల్సి ఉండగా… ఫెన్సింగ్‌ పక్కనే నిర్మాణాలు ప్రారంభించింది ప్రెస్టన్‌ డెవలపర్స్‌ అనే నిర్మాణ సంస్థ.శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 14లో ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట 8.09 ఎకరాల స్థలం ఉంది. ఇందులో విల్లాల నిర్మాణం కోసం ఎస్‌.రంజిత్‌కుమార్‌రెడ్డి పేరిట ప్రెస్టన్‌ డెవలపర్స్‌ సంస్థ 2016 ఫిబ్రవరి 6న జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకుంది. నివాస గృహాలు, వసతులతో కలిపి 29,719.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు ఏప్రిల్‌ 4, 2017లో అనుమతులు జారీ అయ్యాయి. ఇందుకుగాను నిర్మాణదారులు రూ.2.93 కోట్లను బిల్డింగ్‌ పర్మిట్‌ ఫీజుగా చెల్లించారు. గేటెడ్‌ కమ్యూనిటీగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులో స్టిల్ట్‌ ప్లస్‌ మూడంతస్తులుగా 89 విల్లాలు, అదే ప్రాంగణంలో వసతుల కోసం స్టిల్ట్‌ ప్లస్‌ నాలుగంతస్తుల భవనం నిర్మించనున్నట్టు ప్లాన్‌లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం చెరువు పక్కనే ఉన్న ఈ ప్రాజెక్టుకు నిర్ణీత స్థాయి మేర బఫర్‌ జోన్‌ వదలాలి. జీహెచ్‌ఎంసీలోని ఇరిగేషన్‌ విభాగం ఇచ్చే నిరభ్యంతర పత్రం ఆధారంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పనులు ప్రారంభమైన అనంతరం ప్లాన్‌ ప్రకారం జరుగుతున్నాయా..? లేదా..? అన్నది జీహెచ్‌ ఎంసీ అధికారులు పరిశీలించాలి. కానీ వారు పట్టించుకోక పోవడంతో నిర్మాణదారులు నిబంధనలను తుంగలో తొక్కా రు. బఫర్‌జోన్‌ వదలకుండా నిర్మాణాలు చేపట్టారు.గుట్టలబేగంపేట పక్కనే ఉన్న అల్లాపుర్‌ గ్రామ పరిధిలో 32.50 ఎకరాల విస్తీర్ణంలో సున్నం చెరువు ఉంది. ఈ చెరువుకు మాదాపూర్‌ వైపున్న గుట్టల బేగంపేట సర్వే నంబర్‌ 14లో బఫర్‌ జోన్‌ ఉంటుంది. జీఓ 168 ప్రకారం 25 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులకు చుట్టూ 30 మీటర్లను బఫర్‌ జోన్‌గా పరిగణిస్తారు. చెరువు విస్తీర్ణం 25 ఎకరాల కంటే తక్కువుంటే బఫర్‌ జోన్‌ తొమ్మిది మీటర్లు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం సున్నం చెరువు చుట్టూ 30 మీటర్లు అంటే దాదాపు 100 అడుగులు బఫర్‌ జోన్‌గా వదలాలి. ఈ ప్రాజెక్టు విషయంలో బఫర్‌ జోన్‌ నిబంధన అమలు కాలేదు. చెరువుల పరిరక్షణకు గతంలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కంచె పక్కనే కాంపౌండ్‌ వాల్‌ నిర్మించి పనులు చేపట్టారు. ‘వాస్తవంగా ఎఫ్‌టీఎల్‌ పరిధి వద్దే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. ఖాళీ స్థలం ఉండడంతో ప్రిస్టన్‌ డెవలపర్స్‌ ప్రాజెక్టు వైపు ఎఫ్‌టీఎల్‌ దాటి బఫర్‌ జోన్‌లోని 12 మీటర్ల దూరంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశాం’ అని అధికారులు చెబుతున్నారు. ఇది నిజమే అనుకున్నా ఫెన్సింగ్‌ నుంచి మరో 18మీటర్ల స్థలం వదిలి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ప్రహరీని ఆనుకుని పిల్లర్ల నిర్మాణం ప్రారంభించారు. అంటే దాదాపు బఫర్‌జోన్‌లోని దాదాపు 55 అడుగుల మేర పనులు జరుగుతున్నాయి.సున్నం చెరువు పక్కనే ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. బఫర్‌ జోన్‌ వదలకుండా అక్కడ పనులు చేస్తుండడంతో దాదాపు 2 వేల గజాలు నిర్మాణదారులకు కలిసి వస్తోంది. ఖరీదైన ఈ ప్రాంతంలో సుమారు అర్ధ ఎకరా భూమి.. అందులో ఐదారు విల్లాలు నిర్మించినా ఆదాయం కనీసం రూ.30-40 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.గత ఏడాది భారీ వర్షాలు కురిసన సమయంలో సున్నం చెరువు పూర్తిగా నిండింది. దీంతో ప్రస్తుతం ప్రెస్టన్‌ డెవలపర్స్‌ విల్లాలు నిర్మిస్తోన్న వెంచర్‌లోకి భారీగా నీరు చేరింది. గతంలో చెరువును సందర్శించిన జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించారు. కనీసం బఫర్‌ జోన్‌ వదలకుండా ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *