అక్రమానికి లైసెన్స్

Date:08/11/2018
గుంటూరు ముచ్చట్లు:
జిల్లాలో మరోసారి అక్రమ మైనింగ్‌కు ద్వారాలు తెరుచుకున్నాయి. ఒత్తిడికి తలొగ్గిన మైనింగ్‌ శాఖ అధికారులు గుంటూరు, దాచేపల్లి ప్రాంతాల్లో ఏడు గనుల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రధానంగా మైన్స్‌ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్, ఎక్స్‌ప్లోజివ్స్‌ డిప్యూటీ చీఫ్‌ కంట్రోలర్‌ నుంచి అనుమతులు లేకుండానే రెండు రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేమవరంలోని మరో గనిలో కూడా తవ్వకాలకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ వ్యవహారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాత్ర ఉందని, ఎంతమేరకు అక్రమ మైనింగ్‌ జరిగిందీ తేల్చి, రాయల్టీ, పెనాల్టీ వసూలు చేసి అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మైనింగ్‌ అధికారులు అనుమతులు లేని గనులను మూసి వేయించారు. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ జరిపిస్తోంది.
ఇదిలా ఉండగానే మరోసారి అక్రమ మైనింగ్‌కు తెరతీయడం అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనం. అక్రమ మైనింగ్‌పై మైన్స్‌ ఇండస్ట్రియల్‌ సెక్రటరీ నివేదిక తెప్పించుకొని 31 లక్షల టన్నుల మేరకు అక్రమ మైనింగ్‌ జరిగినట్లు హైకోర్టులో అఫిడవిట్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్టీ, పెనాల్టీతో కలిపి రూ.129 కోట్లు వసూలు చేస్తామని చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 98 లక్షల టన్నుల మేరకు అక్రమ మైనింగ్‌ జరిగినట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఆధారాలతో కోర్టుకు నివేదించారు. రాయల్టీ, పెనాల్టీ రూ.546 కోట్ల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని, ఇంతగా అక్రమ మైనింగ్‌ సాగడానికి వినియోగించిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కోర్టును అభ్యర్థించారు.
కాగా, ఈ విషయమై ఏ విచారణా జరగడం లేదు.
హైకోర్టు నివేదించిన అఫిడవిట్‌ ప్రకారం 31 లక్షల టన్నుల ఖనిజం వెలికి తీసేందుకు, 3 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్, 35 లక్షల ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, 15.50 లక్షల జిలెటిన్‌ స్టిక్స్‌ అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు మార్కెట్‌లోకి సరఫరా అవుతుంటే, ప్రత్యేకించి నక్సలైట్ల మూలాలు ఉన్న పల్నాడు ప్రాంతంలో రక్షణకే ప్రమాద సూచిక అవుతుంది. ఈ పేలుడు పదార్థాలు లభ్యమైన దూరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రాజధాని ఉంది.
ఈ పరిణామాలు రాజధాని ఉనికికే ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ శాఖల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ దిశగా విచారించాల్సిన సీబీసీఐడీ కేవలం కూలీలు, మిల్లర్లు, కార్మికులను మాత్రమే టార్గెట్‌ చేయడం గమనార్హం.గనుల్లో తవ్వకాలు జరపాలంటే అనుమతులు తప్పనిసరి. ఇందులో మేట్లు, మేనేజర్లను నియమించుకోవాలి. మైనింగ్‌ తవ్వేటప్పుడు, మైన్‌ పరిస్థితిని వీరు పరిశీలించాలి.
మైన్‌ లోతుకు పోయేకొద్దీ బెంచ్‌ వదులుకుంటూ తవ్వాలి. ఆ నియమాన్ని మైన్‌ యజమానులు పాటించకుండా ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. మేట్స్‌ సర్టిఫికెట్‌తో బ్లాస్టింగ్‌ చేసుకోవచ్చు. వీరికి డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోసివ్స్‌ అనుమతి తప్పనిసరి. వారు ఎంతమేర పేలుడు పదార్థాలు వినియోగించిందీ రిటర్న్‌ పంపాలి. లీజు హోల్డర్, లైసెన్స్‌ హోల్డర్‌ అగ్రిమెంట్‌తో మైన్స్‌ ప్రారంభించేందుకు అవకాశం లేదు.
Tags: No license for unacceptability

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *