రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– విద్యుత్ పై ‘ఈనాడు’ అసత్యపు రాతలు
– రాజకీయం కోసమే సబ్ స్టేషన్ల వద్ద తెలుగుదేశం పార్టీ ధర్నాలు
– విద్యుత్ కోతలపై ఈనాడు ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దు
– సోలార్, హైడల్ ప్రాజెక్ట్ ల నుంచి ఆశించిన మేర విద్యుత్ ఉత్పత్తి లేదు
– రాష్ట్రంలో వేసవి కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం
– దానికి అనుగుణంగ విద్యుత్ ఉత్పతిని పెంచుకున్నాం
– అదనంగా బయటి నుంచి విద్యుత్ కొనుగోళ్ళు చేస్తున్నాం
– వ్యవసాయం, గృహ వినియోగం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం
– విద్యుత్ పై సీఎం వైయస్ జగన్ నిరంతరం సమీక్షలు
అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో విద్యుత్ కోతలు అంటూ ‘ఈనాడు’ పత్రికలో రాస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు ఆశించిన మేరకు హైడల్, సోలార్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి లేకపోయినా, బయటి నుంచి విద్యుత్ కొనుగోళ్ళు చేస్తూ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, గృహ అవసరాలు, పరిశ్రమలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్థంగా విద్యుత్ సరఫరా చేస్తోందని తెలిపారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ రాజకీయం కోసం విద్యుత్ కోతలు ఉన్నాయంటూ సబ్ స్టేషన్ల వద్ద అల్లరి చేయడం, దానిని భూతద్దంలో చూపుతూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాలను రాయడం జరుగుతోందని విమర్శించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్ ఇబ్బందులు తలెత్తకూడదనే లక్ష్యంతో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు నిరంతరం అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారని, రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటున్నామని వివరించారు.
వెలగపూడిలోని సచివాలయంలో ఇంధనశాఖ అధికారులతో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ గత వేసవి సీజన్ లో ఉన్న వినియోగంకు మించి నేడు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం జరుగుతోందని అన్నారు. దానికి అనుగుణంగా థర్మల్ కేంద్రాలను పూర్తి స్థాయిలో పనిచేయిస్తూ విద్యుత్ వినియోగంను పెంచుకుంటున్నామని తెలిపారు. ఈ సీజన్ లో వర్షాలు లేకపోవడం, జలాశయాల్లో నీటినిల్వలు విద్యుత్ వినియోగంకు సరిపడినంత లేకపోవడం వల్ల హైడల్ ప్రాజెక్ట్ ల నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆశించినంత రావడం లేదని అన్నారు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో థర్మల్ కేంద్రాల్లోని అన్ని యూనిట్లను సామర్థ్యం మేరకు పనిచేయిస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట్ల అదనంగా బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచడం, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులకు కూడా పూర్తి స్థాయిలో సిద్దంగా అధికార యంత్రాంగంను ఉంచామని తెలిపారు.
పరిస్థితి ఇలా ఉంటే విద్యుత్ కోతలు అంటూ ఈనాడు పత్రిక, ఈటివి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) కె.విజయానంద్, ఎపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, జెన్కో కో ఎండి కెవిఎన్ చక్రధర్ బాబు, ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags: No power cuts anywhere in the state-Minister Peddireddy Ramachandra Reddy
