కూటమిలో ‘నామినేటెడ్’ పంపకాలు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

పదవులు కోరుతున్న జనసేన, బిజెపి.రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై టిడిపి కూటమిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సోమవారం ఉదయంలోపు అందించాలని సాధారణ పరిపాలనశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని తెలిపింది. దీంతో కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిల్లో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు తెలిసింది. అయితే జనసేనకు, బిజెపికి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. 2014-19 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. టిడిపిలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావహులు భారీగానే ఉన్నారు. మూడేళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు. కేవలం ఐదు ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటినీ చేస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

 

 

Tags:’Nominated’ dispatches in the alliance

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *