నేలాఖరులోగా నామినేటెడ్ పదవులు.

-25కిపైగా కార్పొరేషన్‌ పదవుల భర్తీ యోచనలో సీఎం రేవంత్‌

-సిఎం అమెరికా నుంచి తిరిగి రాగానే ఢిల్లీకి..

-టీపీసీసీ చీఫ్‌ ఎంపిక, నామినేటెడ్‌ అంశాలకు లైన్‌క్లియర్‌ అయ్యే చాన్స్‌

-మూడు, నాలుగు కీలక కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు ఇచ్చే యోచన!

-ఈసారి కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్ల నియామకాలు

 

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

కాంగ్రెస్‌ నేతలకు మరోసారి పదవుల పందేరం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రెండో దఫా నామినేటెడ్‌ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఇంతకుముందు 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. ఈసారి మరో 25కుపైగా పోస్టులను నింపే యోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్‌ అమెరికా, దక్షిణ కొరియాల పర్యటన పూర్తి చేసుకుని వచ్చాక.ఢిల్లీ వెళ్లి ఈ విషయంపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అవుతుందని.. ఈ నెలాఖరులోపే నామినేటెడ్‌ పదవుల జాబితా వెలువడుతుందని వెల్లడిస్తున్నాయి.పదవుల కోసం ఎదురుచూపులు ఎన్నో. తొలి దఫాలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు కలిపి 36 మందికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు అప్పగించారు. ఆ జాబితాలో చోటుదక్కని చాలా మంది మలి జాబితా కోసం ఎదు రుచూస్తున్నారు. చాలా కాలం నుంచీ పార్టీలో పనిచేస్తున్నవారు, విద్యార్థి నాయకులు, అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్నవారు, మహిళా నేతలతోపాటు కొందరు సీనియర్లు కూడా పదవులు ఆశిస్తున్నారు.నెల రోజుల క్రితమే రెండో దఫా పదవుల పందేరం ఉంటుందనే చర్చ జరిగినా ఆ దిశగా అడుగులు పడలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతోందని, వీలైనంత త్వరగా పదవులు ఇవ్వాలని ఆశావహులు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.ఈసారి ఎమ్మెల్యేలకు కూడా!రెండో రౌండ్‌ నామినేటెడ్‌ పదవుల జాబితాలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కీలక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నట్టు చర్చ జరుగుతోంది. ఆర్టీసీ, సివిల్‌ సప్‌లైస్, మూసీ రివర్‌ఫ్రంట్‌ వంటి ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కనివారికి చైర్మన్‌ పదవులతోపాటు కేబినెట్‌ హోదా కల్పిస్తారని సమాచారం.ఇక బేవరేజెస్‌ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన, హ్యాండ్లూమ్స్, గీత కార్పొరేషన్‌ తదితర పోస్టులు కూడా ముఖ్య నేతలకు అప్పగించనున్నట్టు తెలిసింది. వీటితోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు కూడా ఈసారి చైర్మన్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైశ్య కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను ప్రకటించగా.. మిగతా కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించాలని టీపీసీసీ నాయకత్వంపై ఒత్తిడులు వస్తున్నాయి.

 

Tags: Nominated positions within the floor.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *