నెరవేరని ఉపాధి లక్ష్యం 

Date:15/03/2018
నల్గొండ ముచ్చట్లు:
వలసలను నివారించాలనే ఉద్దేశంతో రూపొందించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుండగా నిర్దేశిత లక్ష్యం ఇప్పటి వరకు పూర్తికాలేదు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొత్తం 7,92,800 జాబ్‌కార్డులుండగా.. 4,06,890 మందే పనిచేస్తున్నారు. వీరికి 1,44,30,560 పనిదినాలు కల్పించగా, ఇందులో వంద రోజులు పనిదినాలు కల్పించినవి కేవలం 15,509 కుటుంబాలే ఉన్నాయి.ఉపాధి హామీ చట్టం నిర్దేశించిన ప్రకారం కూలీలకు గరిష్ఠంగా రోజుకు రూ.197 లభించాలి. ఇక్కడ ఆ పరిస్థితిలేదు. నల్గొండ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో పంటల సాగు సమయంలో వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకు రూ.300 నుంచి రూ.400 గిట్టుబాటవుతోంది. ఫలితంగా జాబ్‌కార్డు ఉన్న చాలామంది ఆ పనులకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా అది అమలు కావడం లేదు. నల్గొండ జిల్లాలో 66,27,970 పని దినాలకు రూ.154.95 కోట్లు ఖర్చుచేశారు. సగటున ఏడాదికి 36.5 పనిదినాలు కల్పిస్తుండగా సగటు కూలి రూ.134 లభించినట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 55,88,931 పనిదినాలకు రూ.95.55 కోట్లు ఖర్చు చేశారు. సగటున ఏడాదికి 36 రోజులు మాత్రమే పనికల్పించగా సగటు కూలి రూ.110 గిట్టుబాటైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో   మొత్తం 22,13,659 పనిదినాలకు రూ.64.19 కోట్లు ఖర్చు చేశారు. సగటున ఏడాదికి 31.1 రోజులు పనిని కల్పించగా సగటు కూలీ రూ.140 వచ్చింది.ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు, పనిదినాలు పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదు. ఉపాధిహామీ క్షేత్రస్థాయి సిబ్బందికి లక్ష్యాలు విధించినా, నిర్దేశించిన కూలీలకు కచ్చితంగా పని కల్పించాలని, లేకుంటే చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించినా ఫలితం లేదు. పనులు ఆశించిన స్థాయిలో జరగక పోవడానికి పలు కారణాలున్నాయి. పథకం అమలుపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడటం, ఇతర పనులకు వెళ్తే ఎక్కువ కూలి వస్తుండడం వంటి కారణాల వల్ల ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఉన్నతాధికారులు తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మండలాల వారీగా పనుల తీరును పరిశీలించి కారణాలు తెలుసుకుని లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినా ఫలితం ఉండటం లేదు. వేతనాలు సకాలంలో అందకపోవడం కూడా కూలీలు ముందుకు రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. నిబంధనల ప్రకారం పనిచేసిన 15 రోజులలోపు వేతనం కూలీల ఖాతాల్లో జమ కావాలి. ఇది సక్రమంగా అమలు కావడంలేదు. కొందరు కూలీలకు బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నారు. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో తగినంత నగదు అందుబాటులో లేక వారికి సకాలంలో వేతనం అందటంలేదు. ‘ఉపాధి’ పనులకు వెళ్లిన వారికి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి. ఇక్కడ పనిచేసిన మరుసటి రోజే మస్టర్‌ వేసి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. క్షేత్ర సహాయకులు, ఉపాధి సిబ్బంది అలసత్వంతో వారం రోజులపైగా సమయం పడుతుందనే వాదన వినిపిస్తుంది. నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం బడ్జెట్‌ విడుదలకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఫలితంగా ఉపాధిహామీ కూలీలకు సకాలంలో డబ్బులు అందక నెలల తరబడి జాప్యం జరుగుతోంది.
Tags: Non-fulfillment of employment target

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *