ల్యాండ్ కాని పరిశ్రమలు-నిరుపయోగంగా స్థలాలు

హైదరాబాద్ ముచ్చట్లు:


రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడం, పరిశ్రమల స్థాపనతో ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం వేల ఎకరాలను కేటాయించింది. కానీ ఏళ్లకేళ్లు గడిచిపోతున్నా.. ఆ స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటుకావడం లేదు. అలాగని తిరిగి ప్రభు త్వం చేతిలోకీ రావడం లేదు.వేల ఎకరాలు ఎటూ కాకుండా నిరుపయోగంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే దీనిపై దృష్టి పెట్టి పారిశ్రామిక పార్కుల్లోని ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టినా ఫలితం మాత్రం కానరావడం లేదు. మంత్రి ఆదేశాలు జారీచేసి రెండేళ్లు కావొస్తున్నా.. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలోని పారి శ్రామిక వాడల్లో ఉన్న భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియ అంగుళం కూడా ముందుకు కదలలేదు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భూమి ధర నిర్ణయం, ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చూసుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ 1973 నుంచి 2014 వరకు సుమారు 27 వేల ఎకరాలను అభివృద్ధి చేయగా.. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్‌ఐఐసీ 28వేల ఎకరాల్లో 152 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక చట్టం టీఎస్‌ఐపాస్‌ ద్వారా 2014 నుంచి ఇప్పటివరకు 20,909 పరిశ్రమలకు అనుమతు లు ఇవ్వగా.. రూ.2.41 లక్షల కోట్ల పెట్టుబడులు,

 

 

 

 

16.81 లక్షల మందికి ఉపాధి లభించినట్టు అధికార వర్గాల అంచనా. అయితే పారిశ్రామికవాడల్లో భూములు కేటాయించినా  పరిశ్రమలు స్థాపించకపోవడంతో ఇటు భూములకు, అటు ఉపాధికి గండిపడుతోంది. భూకేటాయింపులు పొందినా కార్యకలాపాలు ప్రారంభించని పరిశ్రమలను గుర్తించి, నోటీసులు జారీ చేయాలని.. ఆయా భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 2020 ఆగస్టులో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన టీఎస్‌ఐఐసీ 65 పరిశ్రమలకు సంబంధించి సుమారు రెండు వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని గుర్తించింది. ఒక ఎకరం మొదలుకుని 250 ఎకరాల మేర విస్తీర్ణం వరకు ఈ ప్లాట్లు ఉన్నట్టు తేలి్చంది. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని రావిర్యాలలో ఉన్న ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్‌ పార్క్, కరకపట్లలోని బయోటెక్‌ పార్క్, నానక్‌రామ్‌గూడలోని పారిశ్రామికవాడల్లో ఉన్న ఈ భూముల కేటాయింపులను రద్దు చేసి.. ఇతర పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించింది.ఆయా పరిశ్రమల యజమానులకు 2020 సంవత్సరం చివరిలోనే నోటీసులు ఇచి్చంది. కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా తిరిగి ప్రభుత్వపరం కాలేదు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో.. వాటిని వదులుకోవడానికి సంబంధిత పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. నోటీసులు అందుకున్నవారిలో కొందరు పనులు ప్రారంభించేందుకు ఒకటి, రెండేళ్లు గడువు ఇవ్వాలని కోరగా.. మరికొందరు టీఎస్‌ఐఐసీకి కొంత మొత్తాన్ని అపరాధ రుసుముగా చెల్లించినట్టు తెలిసింది. కానీ చాలా మంది టీఎస్‌ఐఐసీ తమకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు.నిబంధనల ప్రకారం పారిశ్రామిక వాడల్లో భూకేటాయింపులు జరిగిన రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది.

 

 

 

 

పరిశ్రమలకు భూకేటాయింపులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టిన టీఎస్‌ఐఐసీ ఆయా భూముల్లో కార్యకలాపాల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్లను ఇతర అవసరాలకు వినియోగిస్తుండగా.. మరికొందరు ఖాళీగా వదిలేశారు. రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరగడం, పారిశ్రామిక పెట్టుబడులు, స్థాపన వేగవంతం కావడంతో.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. అయితే టీఎస్‌ఐఐసీ కొన్నేళ్ల కింద భూకేటాయింపుల నిబంధనలను మార్చింది. కేటాయింపులు పొందిన వారికి నేరుగా ‘సేల్‌ డీడ్‌’ ఇవ్వకుండా ‘అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌’ పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తోంది. తాము ఏళ్ల తరబడి కార్యకలాపాలు ప్రారంభించక పోవడానికి ఈ నిబంధనే కారణమని నోటీసులు అందుకున్న కొందరు పరిశ్రమల యజమానులు చెప్తున్నారు. పెట్టుబడి వ్యయంలో 70 శాతం దాకా భూమి కొనుగోలు, భవన నిర్మాణాలకే ఖర్చవుతోందని.. యంత్ర సామగ్రి, పరికరాలకు రుణాల కోసం బ్యాంకులకు వెళితే అప్పు పుట్టడం లేదని అంటున్నారు. భూములకు సంబంధించి ‘సేల్‌ డీడ్‌’ ఉంటేనే రుణాలు ఇస్తామంటున్నాయని వాపోతున్నారు. టీఎస్‌ఐఐసీ ఎన్‌వోసీ ఇస్తామన్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. దాంతో పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభించలేక పోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పారిశ్రామికవేత్తల ఇబ్బందిని తొలగించడం, ఇటు ఖాళీ ప్లాట్ల స్వా«దీనంలో ఇక్కట్లను అధిగమించడం కోసం.. భూకేటాయింపు నిబంధనల్లో సవరణలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు టీఎస్‌ఐఐసీ వర్గాలు చెప్తున్నాయి.  

 

Tags:Non-land industries-useless places

Leave A Reply

Your email address will not be published.