Natyam ad

పని లేని బౌన్సర్లు..

హైదరాబాద్ ముచ్చట్లు:
సెలబ్రెటీలు ఎక్కడికెళ్లినా అక్కడి జనాలను కంట్రోల్ చేయడానికి బాడీగార్డులు ఉండాల్సిందే. పబ్‌‌లు, క్లబ్ లలో గొడవ కాకుండా బౌన్సర్లు ఫీల్డ్లో ఉంటారు. పెద్ద ఈవెంట్లకు వీరికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో చాలామంది బాడీ బిల్డర్లు బౌన్సర్లుగా మారి ఉపాధి పొందుతుంటారు. కరోనాకు ముందు వరకు వీరికి చాలా ఈవెంట్లు, డైలీ డ్యూటీలు ఉండేవి. దీంతో బౌన్సర్లూ బిజీగా ఉండేవారు. కానీ కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్  చాలామందిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినట్టే.. బౌన్సర్లనూ కష్టాల్లో పడేసింది. రెండేండ్ల నుంచి సరైన పని లేకపోవడంతో.. బౌన్సర్లు ఆ ఫీల్డ్నే మార్చుకుంటున్నారు. ఒకప్పుడు బౌన్సర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు సొంతూళ్లకు  వెళ్తున్నారు. ఇంకొందరు సొంతంగా  వ్యాపారం పెట్టుకుంటున్నారు.  మరికొందరు పార్ట్‌‌టైమ్ జాబ్ లు చేస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 40 శాతం ఈ ఫీల్డ్ను విడిచి వెళ్లారని సీనియర్ బౌన్సర్, స్వాట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఫౌండర్ సాధన్ నాయుడు తెలిపారు.
సిటీలో 1500 మందికి పైగా మెన్, విమెన్ బౌన్సర్లున్నారు. వీరిలో 10 నుంచి 15 శాతం మంది మాత్రమే పార్ట్‌‌టైమర్లుగా పబ్ ల వద్ద బౌన్సర్లుగా చేసేవారు. మిగతా 90 శాతం ఫుల్ టైం ప్రొఫెషనల్ బాడీగార్డులుగా పలు సంస్థల్లో పనిచేసేవారు.  కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో మొత్తం రివర్స్ అయిపోయింది. దాదాపు 40 శాతం బౌన్సర్లు వేరే ఫీల్డ్ చూసుకోగా.. ఉన్నవారిలో 90 శాతం పార్ట్‌‌టైమర్లు, 10శాతం ఫుల్‌‌టైమర్లు ఉన్నారని బౌన్సర్లు చెప్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో సెలబ్రిటీలు బయటకు రాకపోవడం, ఈవెంట్లు జరగకపోవడం, పబ్స్, క్లబ్స్ క్లోజ్ అవడంతో ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని,  అందుకే మానేశామని వారు అంటున్నారు.  మరికొంతమంది సిటీలోనే తమ తల్లిదండ్రులకు ఉన్న వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టారు. చాలామంది సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. గతంలో ఈవెంట్లు, ఫంక్షన్లు జరిగితే సెలబ్రిటీల చుట్టూ  సరిపడా బౌన్సర్లు ఉండేవారు. గెస్ట్ రేంజ్, ఫాలోయింగ్ ని బట్టి 10 నుంచి 15 మంది బౌన్సర్లు పనిలో ఉండేవారు. పబ్ లు, క్లబ్ ల్లో అయితే ప్లేస్ , అక్కడికి వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకుని మెన్, విమెన్  బౌన్సర్లను నెల నెలా జీతం ఇస్తూ నియమించుకొనేవాళ్లు. కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఈవెంట్లు స్టార్ట్ అవుతుండగా.. 15 మందిని బౌన్సర్లను నియమించే  ఆర్గనైజర్లు నలుగురైదుగురితో సరిపెడుతున్నారు. నా దగ్గర 200 మంది పర్మినెంట్ బౌన్సర్లు ఉండేవాళ్లు. గతంలో ఎక్కువ ఈవెంట్లు ఉండడంతో చాలామంది జాయిన్ అయ్యారు. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా  పని లేకపోవడంతో కొందరు మానేశారు. ప్రస్తుతం 120 మంది ఉన్నారు. వారిలోనూ 85 నుంచి 90 శాతం పార్ట్‌‌టైమర్లే. అన్నీ ఓపెన్ అయినా ఆక్యుపెన్సీ ఇంకా 100శాతం లేకపోవడంతో ఈవెంట్‌‌, క్లబ్, పబ్ ల మేనెజ్ మెంట్లు కూడా బౌన్సర్లను నియమించుకోవడం లేదు. ఈవెంట్లు కూడా తక్కువగానే జరుగుతుండటంతో అవసరమైతేనే బౌన్సర్లను  పిలుస్తున్నాం.
 
Tags:Non-working bouncers