నాని శైలి విలక్షణం

Noni style is typical
Date:16/04/2019
హైదరాబాద్‌ ముచ్చట్లు:
టాలీవుడ్‌లో ఉన్న హీరోలందరిలో నాని శైలి కాస్త భిన్నం. ఆయన సినిమాలు వాస్తవానికి కాస్త దగ్గరగా ఉంటాయి. ఆయన నటన సహజసిద్ధంగా ఉంటుంది. అందుకే ఆయన్ని నేచరుల్ స్టార్ అంటారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సుమారు పదకొండేళ్ల క్రితం ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. వరసపెట్టి చిత్రాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. తాను చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యా్న్ని చూపించారు. మధ్యలో రెండు మూడు కమర్షియల్ సినిమాలు కూడా చేశారు. మొత్తానికి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న మరో వైవిధ్యమైన సినిమా ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంగా సాగే ఒక ప్రేమికుడు, భర్త, తండ్రి కథ ఇది. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించారు.
‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల జోరును పెంచిన చిత్ర యూనిట్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించింది.ఇదిలా ఉంటే, ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనదైన శైలిలో Are ‘U’ ready ? అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే ఆయన అడిగిన ప్రశ్నలోనే సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను గురించి కూడా చెప్పేశారు. క్రికెట్ నేపథ్యంగా సాగే సినిమానే అయినా చిత్రంలో మరో కోణం ఉందని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ప్రేమ, తండ్రీ కొడుకుల అనుబంధంతో కూడిన ఒక ఎమోషనల్ జర్నీని నాని మనకు చూపించబోతున్నారు. మరి థియేటర్లలో చూడటానికి మీరు సిద్ధమేనా?
Tags: Noni style is typical

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *