మొహం చాటేసిన ఈశాన్య రుతుపవనాలు

Northeast monsoon

Northeast monsoon

Date:16/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
నైరుతి రుతుపవనాలు సగం రాష్ట్రాన్ని దుర్భిక్షానికి గురి చేయగా తదుపరి ఈశాన్య రుతుపవనాలు ఏకంగా రాష్ట్రం మొత్తాన్నీ కరువు కోరల్లోకి నెట్టాయి. ఖరీఫ్‌లో కరువు, వర్షాల మధ్య అంతరాయాల (డ్రైస్పెల్స్‌) వలన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, ఇతర జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు నాలుగు లక్షల హెక్టార్లలో సాగు లేదు. ఖరీఫ్‌లో తగ్గిన సేద్యాన్ని రబీలో పూడ్చుకోవాలని సర్కారు అశించగా ఈశాన్యం ముఖం చాటేయడంతో ఆశలు ఆవిరికానారంభించాయి. ప్రాజెక్టుల ఆయకట్టులో ముందస్తు రబీ కింద సాగైన పంటలకు ప్రభుత్వం నీటి గ్యారంటీ ఇవ్వట్లేదు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో రెండవ పంట సాగుపై మల్లగుల్లాలు పడుతోంది.సాధారణంగా ఈశాన్య కాలంలో బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడుతుంటాయి. గత నెలలో వచ్చిన తిత్లీ తుపాను వర్షాలు రెండు జిల్లాలకే పరిమితమ య్యాయి. ప్రస్తుతం గజ తుపాను సైతం తమిళనాడు సరిహద్దు జిల్లాలపై కొంత వరకు ప్రభావం చూపించొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ‘గజ’ సంగతి అలా ఉంచితే రాష్ట్రంపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఇప్పటి వరకు నామమాత్రమే. దీంతో ఏడాది ఖరీఫ్‌తోపాటు రబీలోనూ కరువు మండలాలను సర్కారు ప్రకటించాల్సి రావొచ్చని విపత్తు నిర్వహణ, అర్థగణాంక, వ్యవసాయశాఖలు అంచనా వేశాయి.
ఈశాన్య కాలం అక్టోబర్‌, నవంబర్‌లో ఇప్పటి వరకు చూసుకుంటే సాధారణ వర్షంలో 76.3 శాతం తక్కువ కురిసింది. అక్టోబర్‌లో లోటు 73 శాతం కాగా నవంబర్‌లో ఈ రెండు వారాల్లో 84 శాతం లోటు వర్షం నమోదైంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సీజను మొత్తమ్మీద సాధారణ వర్షపాతం 296.1 మిల్లీమీటర్లు. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 15 మధ్య 235.7 మిమీ పడాల్సి ఉండగా 55.9 మిమీ పడింది. అక్టోబర్‌లో 168.2 మిమీలకు 44.9 మిమీ, నవంబర్‌లో రెండు వారాల్లో 67.5 మిమీలకు 11 మిమీ కురిసింది. దాదాపు నెలా పదిహేను రోజుల్లో వర్షపు లోటు 76 శాతం పైన ఉండటంతో శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా తతిమ్మా జిల్లాలన్నింటిలో లోటు వర్షపాతం నమోదైంది. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలు అత్యల్పవర్ష పాతం కురిసిన కేటగిరీలో (లోటు 60 నుంచి 99 శాతం) చేరాయి. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం చెందగా ప్రస్తుతం ఆ జిల్లాలో సంతబొమ్మాళి, గార, అముదాలవలస, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో తక్కువ వర్షం రికార్డయింది. జిల్లాలో సర్కారు 25 వరద మండలాలను నోటిఫై చేయగా ఇప్పటికొచ్చేసరికి సరుబుజ్జిలి మండలంలోనే సాధారణ వర్షం కంటే కొంచెం ఎక్కువ కురిసింది. ఇదిలాలా ఉండగా రాష్ట్రం మొత్తమ్మీద వర్షాభావ మండలాల సంఖ్య అంతకంకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి 542 మండలాల్లో లోటు వర్షం నమోదైంది. వాటిలో 134 మండలాలు అత్యల్పవర్షపాత కేటగిరీలో ఉన్నాయి.
Tags:Northeast monsoon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *