అందని గిట్టుబాటు 

Date:14/05/2019
ఖమ్మం ముచ్చట్లు:
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రబీ సీజన్‌లో సాగునీటి కోసం తిప్పలు పడిన రైతు చేతికి అరకొరగా వచ్చిన పంట అమ్ముకుందామన్నా అవస్థలే ఎదురవుతున్నాయి. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం శక్తికి మించిన శ్రమగా మారింది. జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా జరగక.. మరికొన్ని కేంద్రాల్లో నగదు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు పట్టా కూడా లేని పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు.  జిల్లాలో ఈ ఏడాది 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ ఐకేపీ గ్రూపుల ఆధ్వర్యంలో 2,728 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ ధాన్యం 19,143.480 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం ధాన్యం 1,752.200 మెట్రిక్‌ టన్నులు.. మొత్తం 20,895.680 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 8,760 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ రకం ధాన్యం 81,082.760 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం ధాన్యం 3,711.280 మెట్రిక్‌ టన్నులు.. మొత్తం 84,794.040 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌లు కలిపి 11,488 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ రకం ధాన్యం 1,00,226.240 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 5,463.480 మెట్రిక్‌ టన్నులు.. అంటే మొత్తం 1,05,689.720 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. రైతు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తే.. వెంటనే కొనుగోళ్లు చేపట్టడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రైతులు రోజులతరబడి కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. దీనికితోడు ఎండలు ఎక్కువగా ఉండడంతో కాంటాలు వేయడం ఆలస్యమవుతోంది. హమాలీల కొరత కూడా అనేక కొనుగోలు కేంద్రాల్లో ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఉండేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వేసవి కాలంలో విపరీతమైన ఎండతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో తాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి. మధిర కొనుగోలు కేంద్రంలో పందులు సంచరిస్తుండడంతో ధాన్యం ఎక్కడ పాడు చేస్తాయోనని రైతులు కాపలా ఉండాల్సి వస్తోంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలలో ఊరి బయట పొలాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఏ చిన్న గాలిదుమారం వచ్చినా రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇక కొన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వెంటాడుతోంది. పురికోసలు కూడా తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో అకాల వర్షాలు, ఈదురు గాలులు తరచూ వస్తున్నాయి. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు.
ఎలాగోలా కష్టపడి ధాన్యం అమ్ముకున్నా.. అందుకు సంబంధించిన నగదు మాత్రం సకాలంలో అందడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతులకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని అనేక చోట్ల రైతులు ధాన్యం అమ్మి 15 రోజులు గడుస్తున్నా.. ఇంకా నగదు అందజేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 11,488 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు 2,147 మందికి డబ్బులు చెల్లించారు. ఇంకా 9,341 మందికి నగదు చెల్లించాల్సి ఉంది.
Tags: Not good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *