Natyam ad

ఇప్పుడు వార్ మోమెరియల్ రచ్చ

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
జాతీయ రాజకీయాల్లో సడన్ మార్పు వచ్చింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలే జనవరి 20 దాకా దేశంలో చర్చనీయాంశంగా మారిన రాజకీయం. కానీ… జనవరి 21న కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం దేశరాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ.. సరికొత్త వివాదాన్ని తెరమీదికి తెచ్చింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ఉన్న అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని ఎట్టకేలకు జాతీయ యుద్ధ స్మార‌కంలో కలిపేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర 50ఏళ్లుగా అమర జవాన్‌ జ్యోతి నాన్‌స్టాప్‌గా వెలుగుతుంది. అయితే ఆ జ్యోతి ఆరిపోతుందా? జాతీయ యుద్ధ స్మారకంలో జ్యోతిని విలీనం చేయబోతున్నారా? అనే ఎన్నో అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అమర జవాను జ్యోతి ఆర్పివేయట్లేదని స్పష్టం చేసింది. జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేశామని చెప్పింది. ‘‘అమరజవాను జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదు.. అందులో కొంత భాగాన్ని మాత్రమే తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం దగ్గర ఉండే జ్యోతిలో కలిపేశామని’’ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధానిలోని ఇండియా గేట్‌ దగ్గర ఉండే ఈ జ్యోతిని ఆర్పివేసి.. 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం దగ్గర ఉండే జ్యోతిలో విలీనం చేశారు. ఈ రెండు జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూ ఉండేలా చూడటం కష్టమనే అభిప్రాయంతో వీటిని కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.ఈ నిర్ణయం దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ధీర సైనికుల త్యాగాలకు గుర్తుగా వెలుగుతున్న జ్యోతిని ఆర్పివేయడం బాధాకరమని విపక్ష నేతలు అంటున్నారు. కొంతమందికి దేశభక్తి, త్యాగనిరతి ఎన్నటికి అర్థం కావు.. మన సైనికుల కోసం అమర్‌ జవాన్‌ జ్యోతిని మేం మళ్లీ వెలిగిస్తామని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్ర‌భుత్వం జాతి ద్రోహానికి పాల్ప‌డుతోంద‌ని కాంగ్రెస్‌ పార్టీ నేత మ‌నీష్ తివారీ ఆరోపించారు. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు. అమ‌ర్ జ‌వాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మార‌కంతో క‌ల‌ప‌డం అంటే.. చ‌రిత్ర‌ను తుడిచిపెట్ట‌డ‌మే అని ఆయ‌న ఆరోపించారు. జాతీయ యుద్ధ స్మార‌కాన్ని బీజేపీ నిర్మించింద‌ని, అంత మాత్రాన అమ‌ర్ జవాన్ జ్యోతిని ఆర్ప‌డం స‌రికాదు అని తివారీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా చ‌తుర్వేది త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. రెండు జ్యోతుల‌ను ఎందుకు వెలిగించ‌లేమ‌న్నారు. అమ‌ర జ్యోతిని ఆర్ప‌డం.. మంచి రాజ‌కీయాల‌కు సూచ‌కం కాదు అని ఆర్జేడీ నేత మ‌నోజ్ కుమార్ జా ఆరోపించారు.అమర జవాన్ జ్యోతి 1971లో జరిగిన యుద్ధం, ఇతర యుద్ధాల్లో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది, కానీ వారి పేర్లు అక్కడ లేకపోవడం విచిత్రం. ఒకటో ప్రపంచ యుద్ధంలోనూ, ఆంగ్లో-అఫ్గాన్ యుద్దంలోనూ బ్రిటిష్ పాలకుల తరపున పోరాడిన కొందరు అమరుల పేర్లు మాత్రమే ఇండియా గేట్‌పై రాసి ఉన్నాయి.
 
 
 
ఇది మన వలస పాలకులకు మాత్రమే ప్రతీక. 1971లోను, ఆ తర్వాత, అంతకు ముందు జరిగిన, అన్ని యుద్ధాల్లోనూ అమరులైన భారతీయ అమర వీరుల పేర్లన్నీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్నాయి. కాబట్టి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే జ్యోతి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండటమే నిజమైన శ్రద్ధాంజలి అర్పించడం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాల విమర్శలతో కేంద్రం స్పష్టత ఇచ్చింది. అమర జవాన్‌ జ్యోతిపై అసత్య ప్రచారం జరుగుతోందని.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది. అమర జవాన్‌ జ్యోతిలోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో కలుపుతామంది. ఇండియా గేట్‌ దగ్గరున్న ఈ స్మారకంపై 1971లో అమరులైన జవాన్ల పేర్లు లేవు. అయినప్పటికీ ఇక్కడ జ్యోతి వెలుగుతూ ఉండటం వారికిచ్చే నిజమైన నివాళి అనిపించుకోదు. అదే జాతీయ యుద్ధ స్మారకం దగ్గర 1971 యుద్ధ అమరులతో పాటు అనేక మంది వీర జవాన్ల పేర్లను లిఖించారు. అక్కడే ఈ జ్యోతి కూడా వెలిగితేనే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.ఇండియా గేట్ ప్రాంగణంలో 40 ఎకరాల్లో నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ ఉంది. చక్ర వ్యూహం స్ఫూర్తితో స్మారకం నిర్మించారు. రాతి స్తంభం కింది భాగంలో జ్వాల వెలుగుతూ ఉంటుంది. ప్రతిష్టాత్మక యుద్ధ స్మారకం 176 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఇండియా గేట్ ఘన వారసత్వాన్ని గౌరవిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. యుద్ధ స్మారకంలోని 16గోడలపై 25 వేల 942 మంది అమరవీరుల పేర్లు చెక్కారు. గ్రానైట్ రాతిపై అమరవీరుల పేర్లు, హోదా, రెజిమెంట్‌ వివరాలు యుద్ధ స్మారకంలో నాలుగు వృత్తాలుగా చెక్కారు. 4 వృత్తాలకు అమర్‌ చక్ర, వీరతా చక్ర, త్యాగ్‌ చక్ర, రక్షక్‌ చక్ర పేర్లు పెట్టారు. నాలుగు వృత్తాలకు అమర్‌ చక్ర, వీరతా చక్ర, త్యాగ్‌ చక్ర, రక్షక్‌ చక్ర పేర్లతో ‘పరమ్‌వీర్‌ చక్ర’ పొందిన 21 మంది విగ్రహాలు ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రదేశంగా యుద్ధ స్మారకాన్ని మలిచారు. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర సూర్యాస్తమయానికి ముందు ప్రతి రోజు ఒక రిట్రీట్ వేడుక, అలాగే అమర వీరుల కుటుంబ సభ్యుల నెక్ట్స్ ఆఫ్ కిన్ జరుగుతాయి. వారంలో ప్రతి రోజూ దాదాపు ఆరు నుంచి 8 వేల మంది .. వీకెండ్‌లో 20వేల మంది ఈ మెమోరియల్ ను సందర్శిస్తారు. ప్రతీ సాయంత్రం ఇండియా గేట్ ప్రాంతం దేశభక్తి గీతాలతో మార్మోగుతుంది. 1971 భారత్ పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేటు దగ్గర స్మారకంగా ఈ జ్యోతిని ఏర్పాటుచేశారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు.
 
 
 
9మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ సైనికుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు ఇండియా గేట్ నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం, ఆంగ్లో అఫ్గాన్ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున పోరాడిన వారి పేర్లు ఇండియా గేట్‌పై చెక్కబడి ఉన్నాయి.ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నగరంలో 176 కోట్ల వ్యయంతో నేషనల్ వార్ మెమొరియల్ స్మారకాన్ని నిర్మించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్మారకాన్ని ప్రారంభించారు. దీని తర్వాత ఇండియా గేటు దగ్గర జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను నేషనల్ వార్ మెమొరియల్ దగ్గరకు మార్చారు. తాజాగా ఇండియా గేటు దగ్గర నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారు. విగ్రహం రెడీ అయ్యేంత వరకు సుభాష్ చంద్రబోస్ వర్చువల్ రూప ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని జనవరి 23న తానే ప్రారంభిస్తానని మోదీ ప్రకటించారు. ఏడు దశాబ్దాలుగా విస్మరణకు గురైన నేతాజీకి ఇది తగిన గౌరవమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడున్నర దశాబ్దాలుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు దేశరాజధానిలో సరైన గౌరవం దక్కలేదనేది పలువురి అభిప్రాయం. గాంధీ, నెహ్రూలకే గత ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు ప్రాధాన్యత నిచ్చారని.. సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు అజాద్ హింద్ ఫౌజ్‌ని ఏర్పాటు చేసి.. గగన సీమలోనే అసువులు బాసిన నేతాజీని గత ప్రభుత్వాలు విస్మరించాయని బిజెపి వర్గాలంటున్నాయి. ఈక్రమంలో త్వరలో ఇండియా గేట్ దగ్గర ఏర్పాటు కానున్న నేతాజీ విగ్రహంతో ఆయన త్యాగానికి తగిన గుర్తింపు లభిస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. తాజా పరిణామాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో.. ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రేపుతాయో వేచి చూడాలి.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Now the war memorial fuss